సిటీ బస్సు డ్రైవర్లకు అడ్డు అదుపు లేదు..

3 Jul, 2018 11:21 IST|Sakshi
కూకట్‌పల్లిలో బస్టాప్‌నకు దూరంగా బస్సు నిలిపిన దృశ్యం...

రోడ్డు మధ్యలో బస్సుల నిలుపుదల  

బస్‌బేలు, బస్టాపులకు దూరం

ప్రయాణికులు ఎక్కాలన్నా, దిగాలన్నా కష్టమే..

ప్రతి నెలా సిటీలో 1000 నుంచి 1500 వరకు కేసులు నమోదు  

అయినా తీరు మారని ఆర్టీసీ

సాక్షి, సిటీబ్యూరో: ఒక నిమిషం పాటు ఒక సిటీ బస్సు రోడ్డు మధ్యలో నిలిస్తే  ఏమవుతుందో  తెలుసా...కనీసం అరకిలోమీటర్‌ వరకు  వాహనాలు నిలిచిపోతాయి. 10 నిమిషాల పాటు ట్రాఫిక్‌ రద్దీ నెలకొంటుంది. అలాంటిది ఒకేసారి 1000 బస్సులు వేర్వేరు చోట్ల రోడ్డు మధ్యలో నిలిచిపోతే ఎలా ఉంటుంది. కచ్చితంగా మొత్తం అన్నిచోట్లా కలిపితే...500 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించినట్లవుతుంది. విలువైన పనిగంటలు వృథా అవుతాయి. ఉదయాన్నే విధులకు హాజరుకావలసిన సిటీజనులు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సిటీ బస్సుల అడ్డగోలు నిర్వహణ, విచక్షణా రహితమైన  డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగా నగరంలో ఉదయం, సాయంత్రం అదే పరిస్థితి నెలకొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే  గ్రేటర్‌లో ప్రతి రోజు తిరిగే 3550 బస్సులు ఒకరకమైన ట్రాఫిక్‌ టెర్రర్‌ను సృష్టిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా తిరిగే మరో లక్ష ఆటో రిక్షాలు ఈ ట్రాఫిక్‌ టెర్రర్‌కు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలే వెల్లడయ్యాయి.

యథేచ్చగా ‘బే’ఖాతరు...
నగరంలో సుమారు 2 వేల బస్టాపులు, మరో 500 బస్‌బేలు ఉన్నాయి. ఇవి కాకుండా రెతిఫైల్, దిల్‌సుఖ్‌నగర్, సనత్‌నగర్, కోఠి, కాచిగూడ, ఫలక్‌నుమా, తదితర ప్రాంతాల్లో బస్‌స్టేషన్‌లు ఉన్నా యి. బస్‌స్టేషన్‌లలో నిలిచే బస్సులు మినహాయించి మిగతా వాటిలో 80 శాతం రోడ్లపైనే ఆపేస్తున్నారు. బస్టాపులు, బస్‌బేలకు దూరంగా  రోడ్డు మధ్యలో ఆపుతున్న  అడ్డదిడ్డంగా నడిపేబస్సులు వల్ల  ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ ఆగిపోతుంది.వాహనాల రాకపోకలు, ఇరుకు రోడ్ల కారణంగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రెతిఫైల్‌ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, గురుద్వారా, తదితర ప్రాంతాల్లో అడ్డగోలుగా తిరిగే బస్సులు ఆ ట్రాఫిక్‌ రద్దీని మరింత విషవలయంగా మారుస్తున్నాయి. ఉదాహరణకు రెతిఫైల్‌ వద్ద ‘యు’ టర్న్‌ తీసుకొనేందుకు అవకాశం లేదు. కానీ బస్సులన్నీ అక్కడే యూటర్న్‌ తీసుకోవడం వల్ల తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. ఉప్పల్‌ నల్లచెరువు నుంచి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు వరకు రెండు వైపులా ఆరు బస్టాపులు ఉన్నాయి. ఈ బస్టాపుల్లో కాకుండా రోడ్డు మధ్యలో నిలిపివేయడం వల్ల  రెండు వైపులా  బోడుప్పల్‌ చౌరస్తా నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వరకు కనీసం 3 కిలోమీటర్‌ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, దిల్‌షుఖ్‌నగర్, కోఠీ, ఆబిడ్స్, తదితర అన్ని ప్రాంతాల్లో బస్‌బేలు, బస్టాపులు ఉన్నప్పటికీ రోడ్లపైనే  దర్జాగా  ఆపేస్తున్నారు. 

ఎక్కేదెలా దిగేదెలా....
ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు  ఆగుతుందో తెలియదు.ఎప్పుడు కదులుతుందో తెలియదు. దీంతో  ప్రయాణికులు బస్సెక్కాలన్నా, దిగాలన్నా    కష్టంగానే  ఉంటుంది. బస్టాపులో నించున్న ప్రయాణికులు వాహనాలను దాటుకొని   రోడ్డు మధ్యలో ఉన్న బస్సును చేరుకోవాలి. కానీ అప్పటికే ఆ బస్సు ఆగి. ముందుకు కదులుతుంది. బస్సు దగిన వాళ్లు ట్రాఫిక్‌ మధ్యలోంచి రోడ్డు చివరకు రావడం కూడా  దుస్సాధ్యంగా  మారింది. మరోవైపు  ఒకటెనుక ఒకటి వరుసగా వచ్చే  నాలుగైదు బస్సులు ఒకేసారి రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం వల్ల  వాహనదారులకు పట్టపగలే  చుక్కలు కనిపిస్తున్నాయి.    బస్టాపులో  బస్సు నిలిపి  ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అవకాశం  ఉన్నప్పటికీ చాలా మంది  డ్రైవర్లు  ఏ మాత్రం  లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైనే  ఆపేస్తున్నారు.అడ్డగోలు డ్రైవింగ్‌ కారణంగా  ప్రతిరోజు లక్షలాది మంది  వాహనదారులు, ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ  సంస్థాగతమైన  క్రమశిక్షణాచర్యలు తీసుకోవడంలో  ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను  ప్రదర్శిస్తోంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్య మరింత నరకప్రాయంగా మారింది.  ఉదయం  7 నుంచి 10 గంటల వరకు సాయంత్రం  5 నుంచి రాత్రి  8 గంటల వరకు  ట్రాఫిక్‌  భయానకంగా మారుతుంది. 

అమీర్‌పేటలో ఇలా..
కేసులంటే లెక్కలేదు...

బస్‌బేల్లో బస్సులు ఆపకపోవడం వల్ల అనేక చోట్ల అవి ఆటోరిక్షాలకు అడ్డాలుగా మారాయి. బస్‌బేల్లో ఆటోలు ఉండడం వల్లనే  బస్సులు  రోడ్లపైన ఆపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.కానీ  బస్సులను సక్రమంగా బస్టాపుల్లో,బస్‌బేల్లో నిలపకపోవడం వల్లనే  ఆటోలు  పాగా వేస్తున్నాయని  పోలీసులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ప్రతి నెలా సగటున 1000 నుంచి 1500 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో విచక్షణారహితమైన పార్కింగ్, రోడ్డు మధ్యలో నిలిపే బస్సులే  60 శాతం ఉన్నాయి.35 శాతం సిగ్నల్‌ జంపింగ్‌ కేసులు ఉంటే మరో  5 శాతం వరకు సెల్‌ఫోన్‌ లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసిన కేసులు ఉన్నాయి. ఇవి కేవలం పోలీసులు నమోదు చేసినవి. కానీ పోలీసుల దృష్టిలో పడకుండా ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించే నడిపే డ్రైవర్లు, బస్సులు ప్రతి రోజు వెయ్యికి పైగా ఉంటాయని అంచనా. 

అమలుకు నోచని క్యూరెయిలింగ్‌...
ముంబయి తరహాలో  సిటీ బస్సుల రాకపోకలపైన నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో క్యూ రెయిలింగ్‌ల ఏర్పాటు కోసం జరిపిన  అధ్యయనం అటకెక్కింది.నగరంలోని  కూకట్‌పల్లి,ఈఎస్‌ఐ,కేపీహెచ్‌బీ,ఎన్‌ఎండీసీ,సరోజినీదేవి ఆసుపత్రి,నానల్‌నగర్,బాపూనగర్,లకిడికాఫూల్, నాంపల్లి, గృహకల్ప,లోతుకుంట,బోయిన్‌పల్లి,తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

బస్‌బేల పరిస్థితి ఇది...
నగరంలో తిరిగే బస్సులు  : 3550
వివిధ మార్గాల్లో ఉన్న బస్టాపులు : 2000
బస్‌షెల్టర్లు : 1307
ప్రస్తుతం  ఉన్న బస్‌ బేలు  : 500
జీహెచ్‌ఎంసీ  ప్రతిపాదించిన బస్‌బేలు  :220
క్యూరెయిలింగ్‌ కోసం ప్రతిపాదించినవి : 14
కొత్తగా కట్టించిన బస్‌బేలు : లేవు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా