తెలిస్తే చాలు తాట తీసేస్తారు..

29 Jan, 2020 02:03 IST|Sakshi

మహిళలపై నేరాల విషయంలో సిటీ పోలీసులు సీరియస్‌

సాక్షి, సిటీబ్యూరో : దిశ ఉదంతం తర్వాత మహిళలపై జరిగే నేరాలను హైదరాబాద్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొన్ని ఉదంతాలపై ఫిర్యాదు అందకపోయినా సమాచారం ఉంటేచాలు స్పందిస్తున్నారు. సుమోటోగా చర్య లు చేపట్టి బాధ్యుల్ని కటకటాల్లోకి నెడుతున్నా రు. ఈ మేరకు హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ నగరంలోని తూర్పు మండలంలో ఉన్న ఉస్మానియా వర్సిటీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం ఓ నేరంపై సమాచారం అందుకున్న ఈ అధికారులు మంగళవారం బాధ్యుడిని పట్టుకుని కేసు నమోదు చేశారు.  

సీసీ కెమెరాల ఫీడ్‌ ఆధారంగా నిందితుడి గుర్తింపు.. 
సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌.8లోని రవీంద్రనగర్‌లో ఓ ఉదంతం చోటు చేసుకుంది. మార్నింగ్‌ వాకింగ్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ సమయంలో వాకింగ్‌ చేస్తున్న మరికొందరు జరిగిన అంశాన్ని గమనించారు. ఇది కాస్తా ఆ వీధిలో చర్చనీయాంశంగా మారింది. అలా ఆ నోటా, ఈ నోటా విషయం సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన గస్తీ సిబ్బందికి తెలిసింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. రవీంద్రనగర్‌కు సిబ్బందిని పంపి విషయం ఆరా తీయించారు. దీంతో స్థానికులు ఫలానా చోట జరిగిందంటూ ఓ ప్రాంతాన్ని చూపించారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటర్‌పై రావడం.. అక్కడ పార్క్‌ చేసి ఓ మహిళ వెనుక నడుచుకుంటూ వెళ్ళడం.. కాసేపటికి వాహనం వదిలి పారిపోవడం రికార్డయ్యాయి. ఈ ఫీడ్‌లో రికార్డయిన స్కూటర్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ గుర్తించిన పోలీసులు ఆర్టీఏ డేటా ఆధారంగా దాని చిరునామా తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు గౌలిపుర ప్రాంతానికి చెందిన బీరప్పను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఇతగాడు ఉప్పల్‌–సికింద్రాబాద్‌ రహదారిలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తుంటాడని గుర్తించారు. విచారణ నేపథ్యంలో తాను ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించానని అంగీకరించాడు. అయితే బాధితురాలి ఆచూకీ లభించలేదు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులే స్వయంగా సిటీ పోలీసు చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద సుమోటో కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు