సీఎంకు ‘గ్రీన్‌’ గిఫ్ట్‌

17 Feb, 2020 02:50 IST|Sakshi
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రం..

2.5 లక్షల మొక్కలతో కేసీఆర్‌కు జన్మదిన కానుక

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘గ్రీన్‌’గిఫ్ట్‌ ఇచ్చేందుకు నగరం సిద్ధమైంది. సోమవారం సీఎం 66వ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఒక్క రోజే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 2.5 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో 20 వేల మొక్కలు నాటేందుకు అధికారు లు కార్యాచరణ సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీ లోని 150 వార్డులతో పాటు ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలోని కండ్లకోయ జంక్షన్, ఎన్‌పీఏ హుడాపార్క్, సంజీవయ్య పార్క్‌లో సైతం ఆక్సిజన్‌ను విస్తృతంగా అందించే మొక్కలను నాటేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.

సోమవారం ఉదయం 9 గంటలకు రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే మొక్కను నాటుతారు. అనంతరం నెక్లెస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసే హెల్త్‌ క్యాంప్‌ను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రభుత్వ పథకాల ఎల్‌ఈడీ ప్రదర్శనను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించిన అనంతరం ఎంపీ కేశవరావు కేక్‌ కట్‌ చేస్తారు. జల విహార్‌లో ఒగ్గుడోలు, గుస్సాడీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  
లలిత కళా తోరణంలో కేసీఆర్‌ ఆకృతిలో కూర్చుని బెలూన్లు ఎగురవేస్తున్న కవలలు   

2.5 లక్షల మొక్కలు.. 
సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నగరవ్యాప్తంగా 150 వార్డులలో సోమవారం మొక్కలు నాటనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు అనుగుణంగా 36 నర్సరీల నుంచి 2 లక్షల 50 వేల మొక్కలను తరలించి అన్ని వార్డులలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నగర డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు పాతబస్తీలోని జామే నిజామియాలో, ఆరున్నర గంటలకు నాంపల్లిలోని యూసిఫైన్‌ దర్గా ఆవరణలో, 7 గంటలకు సయ్యద్‌ సాహెబ్‌ రహముల్లా దర్గా ఆవరణలో,  మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది.   

రైస్‌మిల్లులు కళకళ 
సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో రాష్ట్రంలో పంటల సాగు, విస్తీ ర్ణం, దిగుబడులు భారీగా పెరిగి రైస్‌మిల్లులకు ఏడాదంతా కలిసి వచ్చిం దని తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2014–15లో తెలంగాణాలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, 2018–19లో 70 లక్షల టన్నులను కొనుగోలు చేశారన్నారు. విద్యుత్‌ కోతలు లేకపోవటంతో ఏడాది మొత్తంగా మిల్లులు కళకళలాడుతున్నాయని, దీనికి ప్రతిఫలంగా సోమవారం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను ప్రతి రైస్‌మిల్లులో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  

వెన్నతో కేసీఆర్‌ శిల్పం
– ఎక్సెల్‌ కాలేజ్‌ విద్యార్థుల రూపకల్పన 
 నాగోలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 66వ జన్మదినం సందర్భంగా ఎల్‌బీనగర్‌లోని ఎక్సెల్‌ కాలేజ్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వాహకులు దూగుంట్ల నరేష్, ఎం.నవకాంత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు వెన్నతో శిల్పాన్ని రూపొందించారు. కల్నరీ ఆర్ట్స్‌లో భాగంగా దీనిని తయారుచేశారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, బేవరేజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాద్, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచంద్రరావు ఆదివారం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.  

66 కిలోల బియ్యంతో..
గజ్వేల్‌ రూరల్‌: కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గజ్వేల్‌ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు 66 కిలోల బియ్యంతో కేసీఆర్‌ ముఖచిత్రాన్ని రూపొందించారు. పట్టణంలోని ప్రగతి సెంట్రల్‌ స్కూల్‌ ఆవరణలో 5 రోజుల పాటు కష్టపడి 66 కిలోల బియ్యంతో 16 అడుగుల భారీ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. గతేడాది కేసీఆర్‌ జన్మదినం నాడు వడ్లతో ఆయన రూపాన్ని చిత్రీకరించగా.. ఈసారి  బియ్యంతో కేసీఆర్‌ ముఖచిత్రాన్ని రూపొందించినట్లు రామరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు