అరెరె.. మతితప్పినె!

17 Mar, 2018 06:45 IST|Sakshi

మతిమరుపులో దేశంలో గ్రేటర్‌ నెం.4

క్యాబ్‌లలో వస్తువులు మరచిపోతున్న సిటీవాసులు

తొలిస్థానంలో బెంగళూరు..రెండు, మూడు స్థానాల్లో ఢిల్లీ, ముంబ

ఉబర్‌ లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ సర్వేలో వెల్లడి

గ్రేటర్‌ సిటీజనుల్లో మతిమరుపు పెరుగుతోంది. ప్రతిరోజు తమకు ఎంతో అవసరమైన వస్తువులను కూడా అనుకోకుండా మరిచిపోతున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. నిద్రలేమి వంటి కారణాల వల్ల సిటీవాసుల్లో ఈ సమస్య పెరుగుతోందట. ఈ విషయంలో హైదరాబాద్‌ దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో నాలుగోస్థానంలో నిలిచినట్లు ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ‘ఉబర్‌ లాస్ట్‌అండ్‌ ఫౌండ్‌’ తాజా సర్వే తెలిపింది.

సాక్షి,సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా గతేడాది తమ ఉబర్‌ క్యాబ్‌ సర్వీసుల్లో రాకపోకలు సాగించిన ప్రయాణికులు.. తర్వాత తమ వస్తువుల కోసం ఆ సంస్థలు ఆశ్రయించినవారి సంఖ్య ఆధారంగా ఈ లెక్కలు వేసింది. ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను విశ్లేషించి ఉబర్‌ లాస్ట్‌అండ్‌ ఫౌండ్‌ తాజా సర్వే ఈ వివరాలను తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో గ్రీన్‌సిటీగా పిలిచే బెంగళూరు నగరం తొలిస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. రెండోస్థానంలో దేశ రాజధాని ఢిల్లీ, మూడోస్థానంలో ముంబై మహానగరం, ఐదోస్థానంలో కోల్‌కతా, ఆరో స్థానంలో చెన్నై నిలిచాయి. ఇక ఆ తరవాతి స్థానాలు పూణే, జైపూర్, చండీగఢ్,అహ్మదాబాద్‌ నగరాలు నిలిచాయి. 

మధ్యాహ్నం తర్వాతే అధికం..  
భోజనం తరవాత భుక్తాయాసం, ప్రయాణంలో కునుకుపాట్ల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో.. అదీ ప్రయాణం చేస్తున్న సమయంలోనే తమ వ్యక్తిగత వస్తువులను సిటీజన్లు పోగొట్టుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధిక మంది ప్రయాణికులు సెల్‌ఫోన్లు, బ్యాగ్‌లు, ఇల్లు, ఆఫీసు తాళాలు పోగొట్టుకుంటున్నారట. మరికొందరు ఐడీ కార్డులు, కళ్లజోళ్లు, గొడుగుల వంటి వ్యక్తిగత వినియోగ వస్తువులను మరిచిపోతున్నట్లు తెలిపింది. మరికొందరైతే ఏకంగా బంగారు ఆభరణాలు, ఎల్‌సీడీ టీవీలు, పిల్లల ఆట వస్తువుల వంటివి పోగొట్టుకుంటున్నట్లు తెలిపారని ఈ సర్వే ప్రకటించడం విశేషం

రాజధాని గ్రేటర్‌లో పరిస్థితి ఇదీ...
ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో అత్యంత ఎక్కువ మరచిపోయే సిటీజన్లున్న నగరాల్లో రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ 8వ స్థానంలో నిలిచిందట. మన దేశంలో అయితే హైదరాబాద్‌ ర్యాంక్‌ .4 కావడం గమనార్హం.
పని ఒత్తిడి, సకాలంలో ఆఫీసు లేదా ఇంటికి చేరుకోవాలన్న టెన్షన్‌లో చాలామంది తమ వ్యక్తిగత విలువైన వస్తువులు పోగొట్టుకుంటున్నారట. ప్రధానంగా బుధ, శనివారాల్లో అత్యధికులు తమ వస్తువులను మరిచిపోతున్నారట.  
గతేడాది (2017)లో ఆగస్టు 19, 24, 26, నవంబరు 23, 25 తేదీల్లో అత్యధిక మంది ప్రయాణికులు తమ వస్తువులను మరచిపోవడం గమనార్హం.
సిటీజన్లు మరిచిపోయిన అరుదైన వస్తువుల్లో వెడ్ డింగ్‌ డ్రెస్‌తో పాటు విలువైన బహుమతులు కూడా ఉంటున్నాయట.

అత్యధికంగా వస్తువులు పోగొట్టుకుంటున్న రోజులు
శని, ఆది, సోమ, శుక్రవారాలు
ఏ సమయంలో అధికంగా వస్తువులు మరిచిపోతున్నారంటే..
ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంట మధ్య.  
తక్కువగా వస్తువులను పొగొట్టుకుంటున్న సమయాలు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉబర్‌ క్యాబ్‌లో వస్తువులు పొగొట్టుకుంటే..   ప్రయాణికులు తమ క్యాబ్‌లలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశాన్ని ‘ఉబర్‌ క్యాబ్‌ బుకింగ్‌ యాప్‌’లోనే కల్పించినట్లు ఉబర్‌ ఇండియా మార్కెటింగ్‌ విభాగాధిపతి సంజయ్‌గుప్త తెలిపారు.
ఉబర్‌ ‘క్విక్‌గైడ్‌’ కోసం మెను ఐకాన్‌పై ట్యాప్‌ చేయండి.
యువర్‌ ట్రిప్స్‌పై ట్యాప్‌ చేసి వస్తువులను మరచిపోయిన ట్రిప్‌ను ఎంపికచేయండి.
రిపోర్ట్‌ ఆన్‌ ఇష్యూ విత్‌ దిస్‌ ట్రిప్‌ను ట్యాప్‌ చేయాలి.
ఐ లాస్ట్‌ యాన్‌ ఐటమ్‌ను ట్యాప్‌ చేయాలి.
కాంటాక్ట్‌ మై డ్రైవర్‌ ఎబౌట్‌ ఎ లాస్ట్‌ ఐటెమ్‌ను ట్యాప్‌ చేయాలి.
కిందకు స్క్రోల్‌ చేసి మిమ్మల్ని సంప్రదించేందుకు అనువైన ఫోన్‌ నెంబరు నమోదు చేసి ఎంటర్‌ చేయాలి.  
ఒక వేళ క్యాబ్‌లో మీ ఫోన్‌ మరచిపోతే దానికి బదులుగా మీ స్నేహితుని ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి. ఇలా చేస్తే మీరు పొగొట్టుకున్న వస్తువులను సదరు క్యాబ్‌ డ్రైవర్లు మీకు సురక్షితంగా అప్పగిస్తారు.   

దేశంలో అత్యంత మతిమరుపు నగరాలివీ..  
నగరం         స్థానం
బెంగళూరు    1
న్యూఢిల్లీ       2
ముంబై        3
హైదరాబాద్‌  4
కోల్‌కత్తా      5
చెన్నై         6
పూణే         7
జైపూర్‌      8
చండీగఢ్‌    9
అహ్మదాబాద్‌    10

ఉబర్‌క్యాబ్‌లలో తరచూ పోగొట్టుకునే ‘టాప్‌ టెన్‌’ వస్తువులివే..
1.ఫోన్‌
2.బ్యాగ్‌
3.వాలెట్‌
4.తాళాలు/కీకార్డులు
5.దుస్తులు
6.ఐడీ/లైసెన్స్‌/పాస్‌పోర్ట్‌
7.కంటి అద్దాలు
8.బాటిల్‌
9.గొడుగు
10.ఆభరణాలు

మరిన్ని వార్తలు