ఎడ్లబండిని ఢీకొని ఇంజినీర్ మృతి

12 Oct, 2015 18:41 IST|Sakshi

పుల్‌కల్ (మెదక్) : జీవనోపాధి కోసం వచ్చిన ఒక సివిల్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఎద్దుల బండిని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. నల్ల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం రామన్నగూడెంకు చెందిన గుడుమల్ల సైదులు(37) మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పథకంలో ఎల్‌ఎన్‌టీ కాంట్రాక్టర్ వద్ద సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కాగా, ఆయన పుల్‌కల్ మండలం పెద్దారెడ్డిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సింగూర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై వస్తుండగా పెద్దారెడ్డిపేటలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎడ్ల (దున్నపోతుల) బండిని ఢీకొట్టి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. సైదులుకు తల్లి, భార్య యశోదతో పాటు ఇద్దరు కుమారులున్నారు.

మరిన్ని వార్తలు