‘సివిల్స్‌’లో  ఓరుగల్లు కెరటం

28 Apr, 2018 07:21 IST|Sakshi

624వ ర్యాంకు సాధించిన కానిస్టేబుల్‌ కుమారుడు

ఐపీఎస్‌ కావడమే లక్ష్యమంటున్న ఎడవెల్లి అక్షయ్‌కుమార్‌

కేఎస్‌.వ్యాస్, ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో రాణిస్తానని ధీమా

కాజీపేట అర్బన్‌ : చారిత్రక ఓరుగల్లు నగర యువకుడు ఎడవెల్లి అక్షయ్‌కుమార్‌ సివిల్స్‌లో ప్రతిభ చాటాడు. తాత, తండ్రి స్ఫూర్తితో రక్షకభటుడిగా దేశానికి సేవలందించాలనే లక్ష్యంతో సివిల్స్‌లో ఐఏఎస్‌కు అవకాశం ఉన్నా ఐపీఎస్‌ను ఎంచుకున్నాడు. 2017 జూన్‌లో ప్రిలిమినరీ, అక్టోబర్‌లో మెయిన్స్‌కు హాజరయ్యాడు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 15 వరకు ఇంటర్వ్యూల్లో పాల్గొని శుక్రవారం వెలువడిన సివిల్స్‌ ఫలితాల్లో 624వ ర్యాంకు సాధించి ఓరుగల్లు కీర్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎడవెల్లి అక్షయ్‌కుమార్‌  ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే.. 
తాత, నాన్నే స్ఫూర్తి.. 
మా తాత, నాన్న ఇద్దరూ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. మా నాన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పనిచేస్తున్న తరుణంలో ఒక రోజు నన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. నాడు నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు చేపట్టే వ్యూహాలు, చర్యలు చాలా బాగా నచ్చాయి. నాడే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
దుబాయ్‌లో రూ.40 లక్షల అవకాశం వచ్చినా..
వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండకు చెందిన ఎడవెల్లి దయాకర్, స్రవంతి నా తల్లిదండ్రులు. బాలసముద్రంలోని గురుకుల్‌ పాఠశాలలో పదో తరగతి వరకు, ఎస్సార్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, భూపాల్‌లోని నిట్‌లో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. బీటెక్‌ పూర్తి చేస్తున్న తరుణంలోనే క్యాంపస్‌ ఇంటరŠూయ్వల్లో ఎంపికై రూ.40 లక్షల ప్యాకేజీకిగాను దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది. కానీ.. ఐపీఎస్‌ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీలో చేరాను. సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించాను. 
అకాడమీ తోడ్పాటునిచ్చింది..
ఐపీఎస్‌ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీలో చేరాను. సివిల్స్‌ 2004, 2016 ర్యాంకర్, ఆల్‌ ఇండియా పొలిటికల్‌ సైన్స్‌ టాపర్‌ బాలలత, మేడం స్ఫూర్తి. ఆమె ప్రోత్సాహంతో అత్యుత్తమ కోచింగ్‌ను అందుకున్నాను. ప్రతి రోజు 9 గంటల పాటు జనరల్, ఆప్షనల్, మెయిన్స్‌లో శిక్షణ అందించేవారు. నేను మరో నాలుగు గంటల పాటు ప్రత్యేకంగా చదివేవాడిని. నాకు సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించడానికి సీఎస్‌బీ అకాడమి ఎంతగానో తోడ్పాటునందించింది.
ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా..
మవోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సేవలందిస్తా. కేఎస్‌.వ్యాస్, ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా. మెరుగైన సమాజ నిర్మాణానికి, దేశరక్షణకు, నక్సలైట్‌ రహిత సమాజానికి సేవలందిస్తా.

మరిన్ని వార్తలు