‘కేబుల్‌ చానళ్ల ఎంపిక’పై హైకోర్టులో ముగిసిన వాదనలు 

1 Feb, 2019 00:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేబుల్‌ టీవీ చానళ్ల ఎంపికకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో, వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న స్థానిక కేబుల్‌ ఆపరేటర్ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ట్రాయ్‌ ఏకపక్షంగా కొత్త నిబంధనలను రూపొందించిందని, అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు గురువారం విచారణ జరిపారు. కొత్త నిబంధనల వల్ల నష్టపోయేది తామేనని పిటిషనర్లు వివరిం చారు. ట్రాయ్‌ కొత్త నిబంధనలను రూపొందించేటప్పుడు తమను సంప్రదించలేదన్నారు. ఈ వాదనలను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) తోసిపుచ్చారు. వీక్షకుల ప్రయోజనాల మేరకే ట్రాయ్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందన్నారు. వీక్షకులు తమకు నచ్చిన చానళ్లనే ఎంపిక చేసుకుంటారని, దీని వల్ల వారు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తారని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు