డిండిపై త్వరలోనే స్పష్టత

1 Apr, 2016 01:51 IST|Sakshi
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల సాగునీరుతోపాటు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగించే తాగునీటి కోసం ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుపై త్వరలోనే స్పష్టతనిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలోనే నల్లగొండతోపాటు పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం పెడతానని, ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
 
  రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లపై గురువారం అసెంబ్లీలో ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ ఆయన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను తెలంగాణకు ఉపయోగించుకునే అవకాశాన్ని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పైన నిర్మించిన ఆనకట్టల విషయాలను, రాష్ట్రంలోని ప్రస్తుత ప్రాజెక్ట్‌ల స్వరూపాన్ని, ప్రభుత్వం చేయదల్చుకున్న రీ డిజైనింగ్ ఆవశ్యకతను ఆయన ఎమ్మెల్యేలకు వివరించారు. 
 
 ఈ సందర్భంగా కేసీఆర్ జిల్లా గురించి, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా డిండి ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న గందరగోళానికి ఆయన తెరదించే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల విషయంలో (ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం వరద నీటి నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీలు కేటాయించాలా, రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు కేటాయించాలా.. 
 
 అనే దానిపై స్పష్టత లేదు.) ఒకట్రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌పై సాయంత్రం జరిగిన చర్చలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కూడా సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్ట్ విషయమై త్వరలోనే రెండు జిల్లా నేతలతో సమావేశం పెడతానని చెప్పారు. అయితే, పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు ఎత్తిపోసే విషయంలో నార్లపల్లి లేదా ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లను తీసుకోవాలా.. డిండికి ప్రత్యేకంగా తీసుకోవాలా అనే విషయంపై చర్చ జరుగుతోందన్నారు. 
 
 అయితే.. నల్లగొండ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగానే తీసుకోవడం మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారని, ఏ విషయమైనా రెండు జిల్లాల నేతలతో జరిగే సమావేశంలో తేలుస్తామన్నారు. ఁనల్లగొండ జిల్లా అనగానే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పేరు చెబుతారు. కానీ, ఈ ప్రాజెక్ట్ కింద జిల్లాలో ఉన్నది నాలుగు నియోజకవర్గాలే. అది కూడా పాక్షికంగానే. జిల్లాలో ఎత్తులో ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల పరిస్థితీ అంతే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు నీళ్లందించేలా ప్రయత్నం చేస్తాం. నాకు పాలమూరుపై ఎంత ప్రేమ ఉందో డిండి, మునుగోడు, నల్లగొండ జిల్లాపై అంతే ప్రేమ ఉంది.* అని అన్నారు. 
 
 ఎస్సెల్బీసీ... ఓ అనివార్యత
  జిల్లాలో ఏళ్ల తరబడి కొనసాగుతోన్న శ్రీశైలం ఎడమ కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్ట్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. ఎస్సెల్బీసీని అనివార్య పరిస్థితుల్లో కొనసాగించాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. ఁప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ (44 కిలోమీట్లరు)ను ఈ ప్రాజెక్టు కోసం తవ్వాలి. దీనికి తోడు మరో ఏడు కిలోమీటర్లు కూడా టన్నెలే. కాల్వలు, అక్విడెక్టులు నిర్మించాలి. దీనిని టన్నెల్ బోర్ మెషీన్ (టీబీఎం) పద్ధతిలో నిర్మిస్తున్నారు. రెండు వైపుల నుంచి మిషన్లను పంపించి తవ్వుకుంటూ వెళ్లాలి.
 
  ఈ టన్నెల్‌లోనికి గాలిని పంపింగ్ చేస్తే, ఆ గాలిని పీల్చుకుని మెషీన్ డ్రైవర్లు టన్నెల్ తవ్వుతారు. అందులోకి ఒక్కసారి మెషీన్ వెళ్లిందంటే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. తవ్వుకుంటూ పోయి మెషీన్లను వదిలేయాల్సిందే. అయితే ఆ మెషీన్లను అందులో ఇరకబెట్టి పనులు ఆపేశారు. ఇప్పుడు ఆ మెషీన్ల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. కచ్చితంగా అనివార్య పరిస్థితుల్లో దీన్ని కొనసాగించాల్సిందే. ఈ టన్నెల్‌ను కూడా నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ పరిధిలో డిజైన్ చేశారు. ఇందులోకి మనుషులు వెళ్లేందుకు అనుమతి ఉండదు. కనీసం ఒకటి, రెండు షాఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుందామన్నా..
 
  వీలు లేదు. అందుకే అనివార్య పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తాం. ఈ టన్నెల్ పొడవునా ఒకటి, రెండు స్టాప్‌లు ఏర్పాటు చేసుకునేందుకు పర్యావరణ శాఖకు ప్రత్యేకంగా అనుమతుల దరఖాస్తులు పంపాం. ఈ ప్రాజెక్టును ఎంత వేగంగా చేసినా ఇంకా మూడేళ్లు పడుతుందని ఇంజనీర్లే అంటున్నరు.* అని కేసీఆర్ వెల్లడించారు. అదేవిధంగా ఎస్సెల్బీసీలో అంతర్భాగంగానే ఉదయసముద్రం నుంచి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను చేపట్టామని, అది రూ.200 కోట్లు ఇస్తే పూర్తవుతుందని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు డబ్బులిస్తున్నామని, ఏడాది కాలంలో  పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు. 
 
 మరి తుంగతుర్తి గురించి ఏంటి?
 సాయంత్రం జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ మైక్ అందుకుని తన నియోజకవర్గానికి సాగునీటి సౌకర్యం క ల్పించే విషయం గురించి చెప్పాలని సీఎంను అడిగారు. దీం తో సీఎం మైక్ అందుకుని మిడ్‌మానేరు పూర్తయిన తర్వాత ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారా వరంగల్ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకే నీళ్లు వస్తాయని చెప్పారు. 
 
 ఆలేరు, భువనగిరి కంటే ముందే ఆ రెండు నియోజకవర్గాలకు నీళ్లొస్తాయన్నారు. అయితే... ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు వచ్చే అవకాశం లేనందున వాటిని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుసంధానం చేశామని చెప్పారు. డిండి ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా నల్లగొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు భూసేకరణ విషయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి బాగా పనిచేశారని, ఇప్పటికే 20 వేల ఎకరాలను సేకరించారని ఆయన ప్రశంసించారు.
 
మరిన్ని వార్తలు