బీజేపీలో టికెట్ల లొల్లి

31 Dec, 2019 08:18 IST|Sakshi

బీజేపీలో కూడా అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. నేను స్పష్టంగా ఒకటే చెప్పదల్చుకున్నా. గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తాం. పైరవీ కారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. పోటీ చేయాలనుకున్న వాళ్లంతా పార్టీ కార్యాలయంలో పాటు ఎంపీ కార్యాలయంలో కూడా దరఖాస్తు ఇవ్వాలి. మేము సర్వే చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్లకే ఇస్తాం. నాయకుల వెంబడి తిరగొద్దని పోటీ చేసే వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు. 

సాక్షి, ఆదిలాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో టికెట్ల లొల్లి నడుస్తోంది. పార్టీ నాయకుల మధ్య విభేదాలతో తమవర్గం వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు పోరు సాగుతోంది. సోమవారం పార్లమెంట్‌ సభ్యుడు సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బీజేపీలో ముఖ్యనేతల మధ్య విభేదాల నేపథ్యంలో ఎంపీ నోటి వెంట ఈ వ్యాఖ్యలకు కారణమైందని ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసినిరెడ్డి మధ్య విభేదాల కారణంగానే పార్టీలో ఒక రకమైన భిన్నమైన వాతావరణం నెలకొందన్న అభిప్రాయం లేకపోలేదు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎంపీ వ్యాఖ్యలు పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి ఉండవచ్చనే చర్చ సాగుతుంది. 

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ కృతనిశ్ఛయంతో ఉంది. నేతల మధ్య గ్రూపు తగాదాలు కొంత కాలంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఓ పార్టీ సమావేశంలో ముఖ్య నేతల ముందే ఈ గ్రూపు కట్టిన నేతలు మాటల వాగ్బానాలు సంధించారు. అంతేకాకుండా పార్టీ పరమైన గ్రామ, మండల కమిటీలను పూర్తి చేశారు. పట్టణ కమిటీని వేశారు. ఇక జిల్లా అధ్యక్షుని ఎన్నిక కూడా ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. మరోసారి పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పాయల శంకర్‌ శ్రేణుల బల సమీకరణ చేసుకుంటుండగా మరోవైపు సుహాసినిరెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పీఠంపై గురిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ విభేదాలకు కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. 

పార్టీలో ఒక ముఖ్యనేత తన బంధువుకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలనే యత్నంతో తన అనుకునే వారికే మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఎదుటి వర్గం ఎంపీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పైరవీలకు తావులేదని ఎంపీ సోయం బాపూరావు కఠినంగా హెచ్చరించారు. అంతేకాకుండా నాయకుల వెంబడి తిరగవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు దరఖాస్తును పార్టీ కార్యాలయంతో పాటు తన కార్యాలయంలో కూడా తప్పని సరిగా చేసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రాధాన్యత కలిగిస్తోంది. దరఖాస్తుపై సర్వే చేసిన తర్వాతనే గెలుపు గుర్రాలను బరిలో దించుతామని చెప్పడం పరోక్షంగా కొంతమంది ఒంటెద్దు పొకడలకు చెక్‌పెట్టే వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయం లేకపోలేదు. 

మరిన్ని వార్తలు