తరగతి గదులకు పునాదులేవీ?

20 Jun, 2014 01:27 IST|Sakshi
తరగతి గదులకు పునాదులేవీ?

- జిల్లాలో 1,328 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- ఏకోపాధ్యాయులతో నడుస్తున్న 314 బడులు
- అసలు గురువులకే నోచుకోని 22 స్కూళ్లు
- తాత్కాలిక సర్దుబాట్లతో కాలక్షేపం
 రాయవరం : రేపు సమాజ స్వరూపస్వభావాలను నిర్దేశించేది నేటి విద్యార్థులేనని ఎందరో మహనీయులు ఉద్బోధించినా;  పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని   విద్యాహక్కు చట్టం ఘోషించినా అవసరమైనంతమంది ఉపాధ్యాయులు లేకుండానే  ప్రభుత్వ పాఠశాలలు నడిచిపోతున్నాయి.  రేపటి తరానికి రూపుదిద్దే శిల్ప శాలల వంటి పాఠశాలల్లో గురువులే శిల్పులన్న స్పృహా, అందుకు అనుగుణమైన కార్యాచరణా లేని పాలకులు.. ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీల భర్తీని తక్షణావసరంగా భావించడం లేదు. అదేదో.. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా తాత్సారం చేయగల చిన్న విషయమన్న వైఖరినే అవలంబిస్తున్నారు. అదిగో.. ఆ అలసత్వానికి కొనసాగింపుగానే ఈ విద్యా సంవత్సరం కూడా ఉపాధ్యాయుల కొరతతోనే ప్రారంభమవుతోంది. ఇక నాణ్యమైన బోధన ఎలా సాధ్యమో, పాఠశాలలు జ్ఞాన సోపానాలుగా ఎలా రూపుదిద్దుకుంటాయో పాలకులే చెప్పాలి.
 
జిల్లాలో గతేడాది కూడా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా విద్యా హక్కు చట్టం ప్రకారం రెగ్యులర్ ఉపాధ్యాయులే ఉండాలన్న నిబంధన సాకుతో ప్రభుత్వం విద్యా వలంటీర్లను నియమించలేదు. దాంతో అటు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకుండా, ఇటు విద్యా వలంటీర్లను నియమించకుండానే విద్యా సంవత్సరం ముగిసి పోయింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా నేటి వరకూ ఆ చర్యలే లేవు. జిల్లాలో 194 స్కూల్ అసిస్టెంట్, 947 సెకండరీ గ్రేడ్, 174 భాషా పండిట్, 13 వ్యాయామోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా.
 
తాత్కాలిక సర్దుబాట్లతోనే కాలక్షేపం
 బదిలీలు, పదోన్నతులు, రిటైర్మెంట్ తదితర కారణాలతో జిల్లాలోని 314 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. అలాంటి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఐదు తరగతుల బాలలకూ, అన్ని సబ్జెక్టులూ బోధించాలి. వారు సెలవులు పెట్టాలంటే వేరే పాఠశాలల ఉపాధ్యాయులు వచ్చి బోధన చేయక తప్పదు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఎలా సాధ్యమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా జిల్లాలో అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 22 ఉన్నాయి.

గతేడాది వేరే పాఠశాలల నుంచి తాత్కాలికంగా ఉపాధ్యాయులను నియమించి మమ అనిపించారు. ఈ ఏడాది కూడా ఆ పాఠశాలల కు ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యం. రాయవరం మండలం పసలపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండు పోస్టులూ ఖాళీగా ఉండగా చొల్లంగిపేట పాఠశాల నుంచి తాత్కాలిక డిప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించారు. ఇక్కడున్న 49 మంది విద్యార్థులకు ఆ ఉపాధ్యాయుడే బోధన చేయాల్సి వస్తోంది. గతేడాది ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడగా..విద్యాబోధనకు ఆటంకం ఏర్పడకుండా కొన్ని చోట్ల అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన చోట సర్దుబాటు చేశారు. పదో తరగతి బోధనకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖాధికారి డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేశారు.
 
ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి..
 జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంది. ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు డీఎస్సీ నిర్వహణ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. గత రెండేళ్లుగా డీఎస్సీ నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన సర్కారు నిర్ణయం తీసుకుని డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ చేపట్టాలంటే కనీసం నాలుగైదు నెలలు పడుతుంది. ఈ లోగా బోధన కుంటుబడకుండా విద్యా వలంటీర్లను నియమిస్తే సమస్యకు కొంతమేరకు పరిష్కారం లభిస్తుంది. కాగా జిల్లాలో పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సిన ఉప విద్యాశాఖాధికారుల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.

రెగ్యులర్ డీవైఈఓలు ఖాళీ పోస్టుల్లో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కాగా జిల్లాలో ఉన్న 58 మండలాలకు యు.కొత్తపల్లి, కాట్రేనికోన, ఆలమూరు, ఆత్రేయపురం, శంఖవరం మినహా మిగిలిన మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఆ మండలాల్లో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు, సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలుగా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. దాంతో వారు బోధన విధులకు న్యాయం చేయలేక పోతున్నారు.

మరిన్ని వార్తలు