అజిత్‌రెడ్డికి క్లీన్‌చిట్‌?

6 Apr, 2017 03:28 IST|Sakshi
అజిత్‌రెడ్డికి క్లీన్‌చిట్‌?

- హాలియా యువకుడి ఆత్మహత్యాయత్నం కేసు దర్యాప్తులో ముందంజ
- అన్ని విషయాలు పోలీసుల ముందుంచిన ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డి?


సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పేషీకి చెందిన ఇద్దరిలో అజిత్‌రెడ్డికి క్లీన్‌చిట్‌ లభించిందా? మరో వ్యక్తి గంగాధర్‌  ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్‌రెడ్డి కృష్ణారెడ్డి నుంచి ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా కృష్ణారెడ్డిని నల్లగొండ పోలీసులు విచారించగా ఆయన పలు విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. అజిత్‌రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని, అతడి ప్రమేయం ఏమీ లేదని కృష్ణారెడ్డి చెప్పాడని సమాచారం. గంగాధర్‌కు లక్షల రూపాయలు ముట్టజెప్పా నని చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డిని ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేయడంతో పాటు, విచారణలో వెల్లడయిన అంశాలతో నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం.

అజిత్‌రెడ్డి పట్టించుకునేవాడు కాదు..
గత నెల 30న హాలియాకు చెందిన యువకుడు సతీశ్‌రెడ్డి సూసైడ్‌ నోట్‌ రాసి  ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నోట్‌లో  కృష్ణారెడ్డి, అజిత్‌రెడ్డి, గంగాధర్‌ పేర్లను రాశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమవద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారన్నాడు. దీంతో ఇంటెలిజెన్స్‌ సైతం ఈ కేసుపై ఆరా తీసింది. కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణా రెడ్డిని నల్లగొండ జిల్లా పోలీసులు విచారిం చినట్టు సమాచారం. అజిత్‌రెడ్డిని గంగాధర్‌ పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను పట్టించుకోలేదని, అజిత్‌రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
 
ఒత్తిడితోనే ఐపీ నోటీసులిచ్చిన కృష్ణారెడ్డి
కృష్ణారెడ్డి విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం.. ఆయన చాలా మంది వద్ద నుంచి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు.  తెలంగాణ జెన్‌కోతోపాటు ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కూడా ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడని, హైదరాబాద్‌లోని భార్యా భర్తలను, నల్లగొండ డీఎంహెచ్‌వో కార్యా లయంలో ఓ ఉద్యోగిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలుస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఓ ఆఫీసును కూడా నడిపించాడని సమాచారం. దీంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసే కృష్ణారెడ్డి ఆ రంగంలో కూడా పలువురుకి అప్పు పడ్డాడని, అన్నివైపుల నుంచి రానున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఐపీ నోటీసులిచ్చాడని పోలీసులు చెపుతున్నారు.

కొనసాగుతున్న విచారణ
గంగాధర్‌కు మాత్రమే తాను లక్షల రూపాయలు ముట్టజెప్పానని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. గంగాధర్‌ ద్వారా తనకు అజిత్‌ పరిచయం అయ్యాడని, గంగాధరే తనను రెండు, మూడుసార్లు సీఎం వద్దకు కూడా తీసుకెళితే ఫొటోలు కూడా దిగానని కృష్ణారెడ్డి చెప్పాడని తెలుస్తోంది. తనకు గంగాధర్‌తో ఐదేళ్లుగా పరిచయం ఉందని, గంగాధర్‌ హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ఇంటికి కూడా తన సహకారం ఉందని కృష్ణారెడ్డి చెప్పడంతో ఆ విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. అయితే, సతీశ్‌రెడ్డి మాత్రం కృష్ణారెడ్డికి రూ.40 లక్షల వరకు ఇచ్చానని చెపుతుండగా, ఇతరుల వద్ద నుంచి వసూలు చేసిన దాంట్లో గంగాధర్‌కు ఎంత ఇచ్చాడన్న దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు చెపుతున్నారు.

మరిన్ని వార్తలు