పరిశుభ్రతే.. శ్రీరామ రక్ష!

29 Mar, 2020 01:27 IST|Sakshi

ముక్కును మూడుసార్లు, నుదురును నాలుగుసార్లు

గంటకు సగటున మనం వాటిని తాకే లెక్క ఇది

2015లో మెడికల్‌ విద్యార్థులపై సర్వేలో వెల్లడి

20 నిమిషాలకోసారి చేతులు కడుక్కుంటేనే మేలు

కరోనా కట్టడికి కచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిందే  

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్న సూచనను పెడచెవిన పెడుతున్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే... కడిగి కడిగి చేతులు అరిగిపోతాయ్‌ జాగ్రత్త అని జోకులేసేవారికి అయితే ఇది చాలా ముఖ్యం కూడా. మనకు తెలియకుండానే మన చేతులు మన ముఖాన్ని, ముఖ భాగాలను టచ్‌ చేస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేల్లో వెల్లడయిన విషయాల ప్రకారం ఒక గంటకు మనం మన ముఖాన్ని ఎన్నిసార్లు తాకుతామో తెలిస్తే అవాక్కవక తప్పదు!. ప్రతి గంటకు ఎన్నిసార్లు మనం మన ముఖాన్ని, ముఖ భాగాలను తాకుతామో తెలుసా... సగటున 23 సార్లు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?.. ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం తన మెడికల్‌ విద్యార్థులపై  నిర్వహించిన సర్వే ఫలితం నిజమో కాదో తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. లేదంటే ఇతరులను నిశితంగా గమనించండి... అప్పుడయినా చేతులు శుభ్రంగా కడుక్కోండి... కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

దాదాపు అన్ని భాగాలు...
ప్రతి వ్యక్తి తన ముఖాన్ని గంటకు ఎన్నిసార్లు తాకుతారన్నదానిపై ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం 2015లో ఓ సర్వే నిర్వహించింది. వర్సిటీలో చదువుతున్న 26 మంది మెడికల్‌ విద్యార్థులను పరిశీలించింది. అప్పుడు వీరంతా కనీసం సగటున 23 సార్లు ముఖాన్ని, ముఖ భాగాలను తాకారని  తేలింది. ప్రతి గంటలో ముక్కు, కంటి భాగాలను మూడుసార్లు చొప్పున.. నుదురు, బుగ్గలు, గడ్డం, పెదవులను నాలుగుసార్లు తాకుతారని... చెవిని గంటకు ఒకసారి మాత్రమే టచ్‌ చేస్తారని ఈ సర్వేలో వెల్లడయింది. ఆఫీసుల్లో పనిచేసిన వారిపై నిర్వహించిన మరో సర్వేలో ఆఫీసు వేళల్లో కనీసం సగటున 16 సార్లు ముఖాన్ని తాకుతారని తేలింది. ఈ మఖభాగాల ద్వారానే కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే అవకాశమున్న నేపథ్యంలో వీలున్నప్పుడల్లా లేదంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిదన్నమాట. అందుబాటులో ఉంటే సబ్బు లేదంటే శానిటైజర్‌ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని ఈ సర్వేల ద్వారా అర్థమవుతోంది. అందుకే... మన వ్యక్తిగత పరిశుభ్రతే... ఈ పరిస్థితుల్లో మనకు శ్రీరామరక్ష. 

మరిన్ని వార్తలు