ప్రశాంతంగా నిమజ్జనం

9 Sep, 2014 00:54 IST|Sakshi
ప్రశాంతంగా నిమజ్జనం

సాక్షి, సిటీబ్యూరో: జంట కమిషనరేట్లలోని 23 చెరువులలో గణేశ్ నిమజ్జనం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగింది. గతేడాది పోలీసుల హడావుడి చేయడంతో నిర్వాహకులు నిమజ్జన ప్రక్రియను త్వరగా పూర్తి చేయగా..ఈ సారి పోలీసులు సహకరించడంతో నిదానంగా నిమజ్జనం చేశారు.  అక్కడక్కడా ట్రాఫిక్‌కు కొంత అంతరాయం కలిగినా మొత్తం మీద చెప్పుకోదగ్గ సమస్యలు తలెత్తకపోవడంతో పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ ఊపిరిపీల్చుకున్నారు.

గతనెల 29న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు నాలుగు రోజుల ముందు నుంచి సోమవారం జరిగిన నిమజ్జనం వరకు అనుసరించిన బందోబస్తు వ్యూహం ఫలించింది. ఉదయం 11.15కి  నిమజ్జనానికి బయల్దేరిన బాలాపూర్ గణేశుడితో ప్రధాన శోభాయాత్ర మొదలైంది. ఈ యాత్రకు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నగర పోలీసు కమిషరేట్ పరిధిలోకి వచ్చే కేశవగిరికి బాలాపూర్ గణేశుడు  చేరుకున్నాడు. అక్కడి నుంచి నగర పోలీసులు ప్రధాన ఊరేగింపునకు బందోబస్తు వహించారు.

చార్మినార్ వద్దకు ప్రధాన ఊరేగింపు చేరేలోపు ప్రార్థనల నేపథ్యంలో అక్కడి స్వాగత వేదికపై మూడు, నాలుగుసార్లు నేతల ప్రసంగాను పోలీసులు నిలిపివేయించారు. అలాగే ఊరేగింపును కూడా కొద్దిసేపు ఆపేశారు.  ఆ తర్వాత ఊరేగింపు ముందుకు సాగింది. ఇదే సమయంలో పాతబస్తీలో డీజీపీ అనురాగ్‌శర్మ, కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, అదనపు సీపీలు అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించారు.  

రెండు గంటల పాటు అక్కడే అన్నారు.  ఆ తర్వాత బషీర్‌బాగ్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మహేందర్‌రెడ్డి అక్కడి నుంచే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీల ప్రసారాలను తిలకిస్తూ అక్కడి నుంచే అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6.30కి బాలాపూర్ గణేశుడు చార్మినార్ దాటాడు. గతంలో బాలాపూర్ గణేశుడు వెనకాల ఎలాంటి విగ్రహాలు వచ్చేవికావు. ఈసారి అలా కాకుండా ముందుగా బాలాపూర్ గణేశుడిని దాటించడం.. ఆ తర్వాత పాతబస్తీలోని విగ్రహాలు బయలు దేరడం జరిగింది.

రాత్రి 9 గంటల వరకు కూడా పాతబస్తీలో ఊరేగింపులు కొనసాగుతునే ఉన్నాయి. ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్  మీదుగా వచ్చిన గణనాథులు లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలిశాయి. ట్యాంక్‌బండ్, మిరాలంట్యాంక్, రాజన్నబావి,ఐడీపీఎల్ చెరువు, ప్రగతినగర్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, అల్వాల్ కొత్త చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్,  షామీర్‌పేట, సూరారం, ఐడీఎల్ , వెన్నెలగడ్డ, లింగం, కాప్రా, కీసర, పూడురు చెరువులు, అలాగే, ఎల్లమ్మపేట, దుర్గం, హిమాయత్‌నగర్, మేకంపూర్ , బోయిన్, సున్నం చెరువు (మూసాపేట), మల్కన్, గంగారామ్‌చెరువులో నిమజ్జనం కొనసాగింది. నగరంలో 30 వేల మంది, సైబరాబాద్‌లో 9400 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమం ఇంకా పూర్తికాకపోవడంతో మంగళవారం కూడా బందోబస్తు యథావిధిగా కొనసాగుతుంది.
 

మరిన్ని వార్తలు