ప్రశాంతంగా టీఎస్‌ ఐసెట్‌

19 May, 2017 02:17 IST|Sakshi

91.93 శాతం మంది అభ్యర్థుల హాజరు
కేయూ క్యాంపస్‌: తెలంగాణలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించిన ఐసెట్‌–2017 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 16 రీజినల్‌ సెంటర్ల పరిధిలో మొత్తంగా 132 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 77,422 మంది అభ్యర్థులకుగాను 71,172 మంది (91.93శాతం) అభ్యర్థులు హాజరయ్యారని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.ఓంప్రకాశ్‌ తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు జరగగా బయోమెట్రిక్‌ పద్ధతి ద్వారా హాజరు నమోదు చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు ఉదయం 8–30 గంటల నుంచే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు.

ఈ నెల 21న ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అం దుబాటులో ఉంచుతామని, ఈ నెల 30న తుది కీ తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని ఓంప్రకాశ్‌ వెల్లడించారు. టీఎస్‌ ఐసెట్‌–2017కు గురువారం ఉదయం 6 గంటలకు కాకతీయ వర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో ప్రశ్నపత్రాల సెట్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపి రెడ్డి ఎంపిక చేశారు. రెండు బాక్సుల నుంచి ‘ఏ’సెట్‌ ప్రశ్నపత్రాన్ని ఆయన ఎంపిక చేయగా అన్ని కేంద్రాలకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని వార్తలు