'విటుడు ఐపీసీ సెక్షన్ 370ఏ పరిధిలోకి వస్తాడు'

25 May, 2015 21:02 IST|Sakshi
'విటుడు ఐపీసీ సెక్షన్ 370ఏ పరిధిలోకి వస్తాడు'

హైదరాబాద్‌: వ్యభిచారానికి పాల్పడే విటుడు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లో కొత్తగా చేర్చిన సెక్షన్ 370ఎ పరిధిలోకి వస్తారని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అన్నీ తెలిసీ వ్యభిచార గృహాలకు వెళ్లి లైంగిక దోపిడీకి పాల్పడే వ్యక్తిపై వ్యభిచార నిరోధక చట్టం (పీఐటీ యాక్ట్) కింద మాత్రమే కేసు నమోదు చేస్తే సరిపోదని, అతనిపై 370ఎ కింద కూడా కేసు నమోదు చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. వ్యభిచారానికి పాల్పడుతూ దొరికిపోయిన ఓ విటుడిపై పీఐటీ చట్టంలోని సెక్షన్ 4 కింద పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 370ఎ కింద కేసును విచారణ స్వీకరించాలని సంబంధిత కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ ఇటీవల ఈ తీర్పునిచ్చారు.


కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడు ఉన్నారు. నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 370 ఎ కింద, పీఐటీ చట్టంలోని సెక్షన్లు 3,4,5,6 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, విటుడిపై మాత్రం పీఐటీ సెక్షన్ 4 కిందే కేసు నమోదు చేసి సంబంధిత కోర్టులో పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విటుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలన్నారు. వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనపై బతికే వారిపై మాత్రమే పీఐటీ సెక్షన్ 4 కింద కేసు నమోదు చేస్తారని, కాబట్టి తనకు ఆ సెక్షన్ వర్తించదని తెలిపారు.

సెక్షన్ 4 కింద పెట్టిన కేసు చెల్లనప్పటికీ, పిటిషనర్‌పై సెక్షన్ 370ఎ కింద కేసు పెట్టవచ్చునని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ అతనిపై సెక్షన్ 4 కింద పోలీసులు పెట్టిన కేసును కొట్టేశారు. నిర్వాహకులపై పీఐటీ చట్టం కింద, ఐపీసీ సెక్షన్ కింద 370 ఎ కింద కేసు పెట్టిన పోలీసులు విటుడిపై కేవలం పీఐటీ చట్టం సెక్షన్ 4 కింద మాత్రమే కేసు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.


విటుడు 370ఎ పరిధిలోకి
ఓ మైనర్‌పై గానీ, ఓ మహిళపై గానీ లైంగిక దోపీడీకి పాల్పడుతున్నామని తెలిసీ కూడా వ్యభిచారానికి పాల్పడితే ఆ వ్యక్తి సెక్షన్ 370 ఎ పరిధిలోకి వస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, తరువాత జరిగిన పరిణామాలు, పలు చట్టాలకు చేసిన సవరణల గురించి న్యాయమూర్తి తన తీర్పులో చర్చించారు.


సవరణల నిర్ణయంలో భాగంగానే ప్రభుత్వం ఐపీసీలో సెక్షన్ 370కి అదనంగా సెక్షన్ 370 ఎ ని తీసుకొచ్చిందన్నారు. వ్యభిచారం విషయంలో విటుడిని అమాయక బాధితుడిగా చూడటం ఈ సవరణల ప్రధాన ఉద్దేశం ఎంత మాత్రం కాదని తెలిపారు. కాబట్టి విటుడు కూడా సెక్షన్ 370ఎ పరిధిలోకి వచ్చి తీరుతాడన్నారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే, పిటిషనర్ సెక్షన్ 370 ఎ కింద కేసు ఎదుర్కొనేందుకు అర్హుడేనని తెలిపారు. కాబట్టి హైకోర్టుకున్న స్వతఃసిద్ధ అధికారాల ఆధారంగా పిటిషనర్‌పై పీఐటీ చట్టంలోని సెక్షన్ 4 కింద కాకుండా ఐపీసీలోని సెక్షన్ 370ఎ కింద కేసును విచారణకు స్వీకరించాలని కింద కోర్టును ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు