ఈసారి చలి తక్కువట

6 Dec, 2019 03:02 IST|Sakshi

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా

భూతాపం కారణంగా వాతావరణ మార్పులు

ఈ ఏడాది చలి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణలో పలు చోట్ల రాత్రిపూట 10 సెంటీగ్రేడ్‌ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఈసారి కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు తక్కువ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీలు నమోదయ్యే అవకాశముంది. గతంలోలాగా 4 లేదా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఈ సీజన్‌లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అవుతున్నాయని పేర్కొంటున్నారు.

వాతావరణ మార్పుల కారణంగానే సీజన్లలో గణనీయమైన తేడా కనిపిస్తుందని, ఏడాదిగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌లో గతేడాది డిసెంబర్‌ 4న 8.3 డిగ్రీల రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్‌ 4న అక్కడ 15.6 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. అంటే దాదాపు రెట్టింపు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గతేడాది డిసెంబర్‌ 4న మెదక్‌లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజున 17.8 డిగ్రీలు నమోదైంది.

గతేడాది నవంబర్‌ 27న ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే నెల అదే తేదీన 15.2 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. గతేడాది నవంబర్‌ 27న హైదరాబాద్‌లో 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ ఏడాది అదే నెల అదే తేదీన 18.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అనేక చోట్ల నాలుగైదు డిగ్రీల నుంచి రెట్టింపు వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్‌

మారుతున్న కాలాలు 
భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. వేడి తీవ్రత పెరుగుతోంది. దీంతో కాలాలు మారిపోతున్నాయి. అధిక వేడి, అధిక వర్షాలు నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో వేసవిలో అధిక వడగాడ్పులు నమోదయ్యాయి. 2017 వేసవి కాలంలో 10 రోజులు కూడా వడగాడ్పులు నమోదు కాలేదు. కానీ 2018 వేసవిలో ఏకంగా 44 రోజులు వడగాడ్పులు వీచాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చినా సకాలంలో వర్షాలు కురవలేదు. జూలై వరకు పరిస్థితి అలాగే ఉంది. ఆగస్టు తర్వాతి నుంచి అక్టోబర్‌ వరకు అధిక వర్షాలు కురిశాయి.

ఇంకా రాని చలిగాలులు 
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కూడా ఈసారి ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో మొదలు కావాల్సిన నైరుతి ఉపసంహరణ, అక్టోబర్‌లో మొదలైంది. దీంతో ఈసారి ఉత్తర భారతం నుంచి రావాల్సిన చలిగాలులు ఆలస్యమయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఉత్తర భారతం నుంచి చలిగాలులు గత నెల మొదటి, రెండో వారాల మధ్యే తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ ఇప్పటికీ  రాలేదు. ఈ నెల మూడో వారంలో వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు.

ప్రస్తుతం తూర్పు దిశ నుంచి తేమ గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఈ తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో మేఘాలు ఏర్పడతాయి. ఫలితంగా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా రుతువులు గతి తప్పిపోయాయి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అంతుబట్టకుండా ఉందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు