కోటి కొట్టేశారు!

10 May, 2015 01:12 IST|Sakshi
కోటి కొట్టేశారు!

పలు బ్యాంకుల నుంచి క్లోనింగ్ ద్వారా డబ్బు డ్రా చేసిన ముఠా
ముంబై కేంద్రంగా సాగిన వ్యవహారం
పోలీసులకు చిక్కిన  సీసీ కెమెరా ఫుటేజ్‌లు
బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన


హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడే ముంబాయికి చెందిన ముగ్గురు సభ్యుల ముఠా.. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న డబ్బులపై పంజా విసిరింది. ముంబాయిని కేంద్రంగా చేసుకున్న ఈ ముఠా నాలుగు నెలల వ్యవధిలో కొన్ని జాతీయ బ్యాంకులకు చెందిన ఖాతాదారుల అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.కోటి వరకు డ్రా చేసింది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సిండికేట్ బ్యాంకులో ఉన్న 19 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.7 లక్షలు డ్రా చేశారని నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ఫిర్యాదు అందడంతో నకిలీ ఏటీఎం(క్లోనింగ్) ద్వారా ఈ ముఠా నగదు డ్రా చేసిన విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం కేసును మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో సిండికేట్ బ్యాంకు ఖాతాదారులే కాకుండా మరిన్ని బ్యాంకుల ఖాతాదారులు కూడా వీరి బారిన పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
రూ.7 లక్షలు డ్రా

మారేడుపల్లికి చెందిన విల్సన్‌స్టాన్లీ పికెట్‌లోని సిండికేట్ బ్యాంక్‌లో ఖాతాదారుడు. ఈయన అకౌంట్‌లో నుంచి ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రతి రోజు కొంత మొత్తం నగదు డ్రా అవుతూ వచ్చింది. ఇలా రూ. 3 లక్షలు డ్రా అయింది. వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎంవీ. నర్సింగ్‌రావు కూడ ఇదే బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఈయన అకౌంట్‌లో నుంచి రూ. 70 వేలు డ్రా అయ్యాయి. రైల్వే ఉద్యోగి అర్జున్‌రావు అకౌంట్‌లో నుంచి ఈ నెల 2న అర్ధరాత్రి రూ. 25వేలు డ్రా అయ్యాయి. ఇలా దాదాపు 19 మంది పికెట్ సిండికేట్ బ్యాంక్ శాఖకు చెందిన ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు డ్రా అయ్యాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళన

డ్రా విషయమై బాధితులు పలుమార్లు పికెట్ సిండికేట్ బ్యాంక్ ఛీప్ మేనేజర్‌ను కలువగా చూస్తాం.. చేస్తాం.. అంటూ సమాధానం రావడంతో బాధితులు ఆగ్రహానికి గురైయ్యారు. ఈ క్లోనింగ్‌కు పాల్పడింది ముంబైకి చెందిన ముఠా అని మీడియాలో వార్తలు వెలువడడంతో  బాధితులు  శనివారం వెస్ట్‌మారేడుపల్లిలోని పికెట్ వద్ద ఉన్న సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మారేడుపల్లి ఎస్‌ఐ రవికుమార్ బ్యాంక్‌కు  చేరుకుని వివరాలు సేకరించారు. కాగా పోలీసుల దర్యాప్తులో ముంబై కేంద్రం నుంచి నిందితులు డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. అక్కడి ఏటీఎం ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలసి ఈ అక్రమానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. వీరు ఆయా బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు రూ.కోటి వరకు డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ విషయంలో బ్యాంకు అధికారుల స్పందన సరిగా లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగదు అపహరణపై పూర్తిస్థాయి విచారణ

ముంబైకి చెందిన ఏటీఎంల ద్వారానే సిండికేట్ బ్యాంక్ నుంచి డూప్లికేట్ ఎటీఎం (క్లోనింగ్) ద్వారా నగదు డ్రా అయిందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేషు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. అయితే బాధితుల జాబితా వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
 
 జాగ్రత్తలు ఇలా...

     
Mెడిట్/డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి.దుకాణ యజమానులు సైతం ఎవ రైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్నదాంతో సరిచూడాలి.{పతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నంబర్ ఉంటుంది. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుని, కార్డుపై చెరిపేయాలి.ఆన్‌లైన్ ద్వారా వ్యవహారాలు సాగించినట్లయితే.. మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్.. హెచ్‌టీటీపీతోనే ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. మరి కొన్ని వివరాలకు హైదరాబాద్ పోలీసు వెబ్‌సైట్ చూడండి.
 
చైనా నుంచి  పరికరాల దిగుమతి
 
ఈ తరహా నేరాలు చేస్తున్న వ్యక్తులు హ్యాకింగ్, సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా పరిచయమై ముఠాగా ఏర్పడి క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను తస్కరించి, నకిలీ కార్డుల్ని తయారు చేస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అక్కడే డేటా చోరీ, క్లోన్డ్ కార్డుల వినియోగం చేస్తే దొరికిపోతామనే భయంతో మరో ప్రాంతానికి కార్డుల్ని పంపిస్తారు. దీనికోసం ఆన్‌లైన్ ద్వారా చైనా పరికరాలను తెప్పిస్తున్నారు.
 
చేతిలో ఇమిడే స్కిమ్మర్లతో...

 
 అరచేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లతో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తదితర చోట్ల పనిచేసే వారి ద్వారా వినియోగదారుడి కార్డు డేటాను సేకరిస్తారు. అలాగే ఏటీఎం సెంటర్లలోనూ మినీ స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి దాని ద్వారా డేటా, సీక్రెట్ నంబర్‌ను కనుక్కొంటారు. ఈ డేటా ఆధారంగా నకిలీ కార్డులను సృష్టించి వినియోగ దారుల డబ్బు కొల్లగొడతారు.
 

మరిన్ని వార్తలు