యాభై ఏళ్ల వెలుగులకు తెర!

4 Jul, 2018 00:47 IST|Sakshi

త్వరలో కేటీపీఎస్‌ పాత యూనిట్ల మూసివేత

దశలవారీగా ఎనిమిది యూనిట్ల మూసివేతకు సన్నాహాలు

తీవ్ర కాలుష్యంతోపాటు నిర్వహణ భారమే కారణం

కాలుష్యంపై పీసీబీతో అధ్యయనం జరిపిస్తున్న జెన్‌కో

800 మెగావాట్ల కొత్త యూనిట్‌ సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతోపాటు ఆర్థికంగా భారంగా మారిన కొత్తగూడెం థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం (కేటీపీఎస్‌)లోని పాత విద్యుదుత్పత్తి యూనిట్లను మూసివేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) చర్యలు ప్రారంభించింది. 1,750 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న 11 యూనిట్లు కేటీపీఎస్‌లో ఉండగా.. అందులో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 యూనిట్లను దశల వారీగా మూసివేసేందుకు లాంఛనాలు మొదలుపెట్టింది.

అర్ధ శతాబ్దపు వెలుగులు..
కేటీపీఎస్‌ తొలి దశ కింద 1966లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, రెండో దశ కింద 1967లో రెండు 60 మెగావాట్ల (2్ఠ60) యూనిట్లు, మూడో దశ కింద 1974, 1975ల్లో రెండు 120 మెగావాట్ల్ల (2్ఠ120) యూనిట్లు, నాలుగో దశ కింద 1977, 1978లలో రెండు 120 మెగావాట్ల (2్ఠ120) యూనిట్లను నిర్మించారు. అర్ధ శతాబ్ద కాలం పాటు ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించిన ఈ కేంద్రాలకు ప్రస్తుతం కాలం చెల్లింది.

వీటి నుంచి విద్యుదుత్పత్తి జరపడానికి అధిక మొత్తంలో బొగ్గు మండించాల్సి వస్తుండటంతో వ్యయం తడిసి మోపెడవుతోంది. మరోవైపు తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యాన్ని వెదజల్లుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ నుంచి ఏడాది కిందే జెన్‌కో విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో 720 మెగావాట్ల కేటీపీఎస్‌ తొలి నాలుగు దశల్లో నిర్మించిన మొత్తం యూనిట్లను అధికారికంగా మూసివేసేందుకు జెన్‌కో ప్రక్రియ ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఈ విద్యుత్‌ కేంద్రాలు వెలువరుస్తున్న కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో అధ్యయనం జరిపించి నివేదిక రూపొందించాలని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు విద్యుత్‌ సౌధలో నిర్వహించిన ఓ సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా దశలవారీగా ప్లాంట్ల మూసివేతకు చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ)కు గతంలో ఇచ్చిన హామీ మేరకు 2019 మార్చిలోగా ఈ విద్యుత్‌ ప్లాంట్లను జెన్‌కో మూసివేయాల్సి ఉంది.


నెలాఖరులో 7వ దశ ప్రారంభం
ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న 800 మెగావాట్ల (1్ఠ800) కేటీపీఎస్‌ 7వ దశ విద్యుత్‌ ప్లాంట్‌ నుంచి నెలాఖరులోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. సూపర్‌ క్రిటికల్‌ బాయిలర్‌ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కొత్త విద్యుత్‌ కేంద్రం అందుబాటులోకి వస్తున్నందున గతంలో సీఈఏకి ఇచ్చిన హామీ మేరకు 720 మెగావాట్ల పాత విద్యుత్‌ కేంద్రాల్ని మూసేస్తామని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. తొలుత 60 మెగావాట్ల యూనిట్‌ను మూసేస్తామన్నారు.

కేటీపీఎస్‌ తొలి 4 దశలకు సంబంధించిన 720 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను మూసేస్తే, 5వ దశ కింద 1997–98 లో నిర్మించిన రెండు 250 మెగావాట్ల యూనిట్లు (2్ఠ250), 6వ దశ కింద 2011లో నిర్మించిన 500 మెగావాట్ల యూనిట్‌ (1్ఠ500) మిగలనుంది. ఏడో దశలోని 800 (1్ఠ800) మెగావాట్ల యూనిట్‌ జతకానుంది. పాత యూనిట్ల మూత, కొత్త యూనిట్‌ నిర్మాణం తర్వాత కేటీపీఎస్‌ సామర్థ్యం 1,800 మెగావాట్లకు చేరనుంది.

మరిన్ని వార్తలు