టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొందాం!

6 Sep, 2015 04:00 IST|Sakshi

సీఎల్పీ అత్యవసర భేటీలో నేతలు
 సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ శాసనసభాపక్షం తీవ్రంగా పరిగణించింది. అధికార టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కోవాలని, నేరుగా పోరాట పంథాకు దిగాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర భేటీలో ఈ మేరకు తీర్మానించారు. ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్న టీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నరుకు వినతిపత్రాన్ని ఇచ్చి, ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిద్దామని జానా, ఉత్తమ్ తదితరులు అభిప్రాయపడగా... ఇంకా గవర్నర్‌కు, సీఎంకు వినతిపత్రాలంటూ కాలయాపన అనవసరమని పలువురు ఎమ్మెల్యేలన్నారు. వాటి ద్వారా ఒరిగేదేమీ లేదని ఎంపీ వి.హనుమంతరావు వాదించారు.

విపక్ష ఎమ్మెల్యేలపై దాడులతో టీఆర్‌ఎస్ నేతలు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. అవసరమైతే టీడీపీతో సహా అన్ని పార్టీలతో కలిసి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొందామన్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులన్నారు. ఎన్టీఆర్ వంటివారినే ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్‌ను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదన్నారు. సౌమ్యులుగా పేరున్న చిన్నారెడ్డి, చిట్టెంలపైనే దాడికి దిగితే తనవంటి వారి పరిస్థితేమిటని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రశ్నించారు. గవర్నర్‌ను కలవకుండానే నేరుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిద్దామని యువ ఎమ్మెల్యేలన్నారు. అపాయింట్‌మెంట్ తీసుకున్నాక కలవకపోవడం సరికాదని సీనియర్లు అనడంతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు.
 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు: ఉత్తమ్
 టీఆర్‌ఎస్ దురాగతాలను నిరసిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ‘రైతును రక్షించండి-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ నినాదంతో 7న సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాగును నిర్లక్ష్యం చేయడం, రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్‌ఎస్ భౌతిక దాడులు తదితరాలను నిరసిస్తూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు