‘ఆ టెండర్లపై సెంట్రల్‌ విజిలెన్స్‌కు లేఖ రాస్తాం’

9 May, 2020 15:54 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పోలీసులను కపలా పెట్టి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల తాగుబోతులు మృతి చెందిన పర్వాలేదని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు. ఒక పక్క తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజలను ఆదుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు 21 వేల కోట్లతో టెండర్లు పిలవడం సబబేనా అంటూ విమర్శలు గుప్పించారు. టెండర్లు పిలవడం రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత పనుల వల్ల అదనంగా రూ.8 వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణ ఇప్పటికే 3 లక్షల 21 వేల అప్పుల్లో ఉందని.. మళ్ళీ మరో 21 వేల కోట్ల భారమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి,కాళేశ్వరం టెండర్లపై సెంట్రల్‌ విజిలెన్స్‌కు లేఖ రాస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను, మీడియాను తిడితే అసలు విషయాలు బయటకు రావని సీఎం కేసీఆర్‌ ఆలోచన అని దుయ్యబట్టారు. మద్యం షాపులు తెరవడం వల్ల ఇన్ని రోజులు వైద్యులు, పోలీసులు శ్రమ అంతా వృధా అయ్యిందన్నారు.

రాజీలేని పోరాటం చేయాలి: శ్రీధర్‌బాబు
రాబోయే రెండు వారాల్లో కరోనా వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఇసుక తరలింపు కోసం పనిచేసేవారికి ఎలాంటి టెస్టులు నిర్వహించడం లేదన్నారు. తెలంగాణకు ఆదాయం వచ్చే వాటిలో చిన్న,సన్నకారు వ్యాపారుల పాత్ర కూడా కీలకమన్నారు. కేంద్రం కోటి 70 వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుందని.. దేశంలో ఇంతటి పరిస్థితుల్లో ఫైనాన్సిల్ ప్యాకేజి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందన్నారు. సింగపూర్, మలేషియా లాంటి చిన్న దేశాలు కూడా వారి  ప్రజలకు నమ్మకం కల్పించాయన్నారు. దేశంలో ప్రతి పేద కుటుంబానికి 7,500 నగదు ఇవ్వాలనే రాహుల్ గాంధీ సూచనను పక్కన పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల విషయంలో రాష్ట్రాల హక్కులను లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో  రాజీలేని పోరాటం చేయాలని శ్రీధర్‌బాబు హితవు పలికారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు