కళ్లకు గంతలు కట్టుకున్నారా..?

4 Sep, 2019 17:03 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు డెంగీ, మలేరియా, విష జ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రులన్నీ దుర్భరంగా ఉన్నాయన్నారు. ఏం.ఆర్.ఐ. సిటీ స్కాన్, బ్లడ్ ప్లేట్ లెట్ సేపరేటర్ ఎక్విప్ మెంట్, ఈసీజీ, ఎక్స్ ప్లాంట్ లేవని భట్టి వివరించారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో స్త్రీ, పురుషులిద్దరీని ఒకే బెడ్ పై పడుకో బెట్టి చికిత్స అందించడం దారుణమన్నారు. అలా చికిత్స చేయించుకునే వారు కూడా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని ఆయన వివరించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో సరైన పరికరాలు, మందులు లేవని.. మంత్రి ఈటెల అంతా బాగుందని మాట్లాడటం సరికాదన్నారు. తాను రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించే పరిస్థితి లేదన్నారు.  రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లోనూ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్.. టీఆర్ఎస్ ఓనర్ షిప్ పంచాయతీలో పడి .. ఈ విషయాలు పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోందన్నారు. ఈటెల పార్టీ ఓనర్ షిప్ లొల్లి కొద్దిగా పక్కన పెట్టి .. రాష్ట్రంలో  ఆసుపత్రుల దుస్థితిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో  అధిక శాతం రైతులకు రైతుబంధు డబ్బులు అందడం లేదని.. రుణమాఫీకి దిక్కులేదని విమర్శించారు.

>
మరిన్ని వార్తలు