నిధుల్లేక సర్పంచ్‌ల గోస: భట్టి

14 Mar, 2020 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పల్లె ప్రగతి లక్ష్యం మంచిదే అయినా.. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు సమస్యలు ఎదుర్కొంటున్నారని శాసనసభ కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టు విక్రమార్క అభిప్రాయపడ్డారు. నిధుల కొరతతో సతమతమతున్న పంచాయతీలపై ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలతో ప్రభుత్వం భారం మోపుతోందని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లెప్రగతిపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్న నిధుల్లో దాదాపు మొత్తం నిధులు వీటి కొనుగోలు, మల్టీ పర్పస్‌ వర్కర్ల జీతాలకే ఖర్చవుతున్నాయన్నారు.

మేజర్‌ పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే.. చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు నిధుల్లేక, బ్యాంకు గ్యారెంటీగా స్థానిక సర్పంచ్, కార్యదర్శులేగాకుండా అవసరమైతే ఎంపీవో, ఎంపీడీవోలు కూడా ఇస్తున్నారని, వాయిదాలు కట్టకపోతే జీతాలు కట్‌ అయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు జరుపుతున్నప్పటికీ, విడుదల చేస్తున్న నిధులన్నీ సిబ్బంది వేతనాలు, ట్రాక్టర్‌ నిర్వహణకు సరిపోతుందని, అభివృద్ధికి నిధుల్లేకుండా.. పల్లె ప్రగతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలకు కేంద్రం విడుదల చేస్తున్న ఉపాధి హామీ పథకం నిధులను వాడుకుంటోందన్నారు. 

>
మరిన్ని వార్తలు