సీఎల్పీ లీడర్.. టీపీసీసీ చీఫ్!

19 May, 2014 02:18 IST|Sakshi

జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డికి పార్టీలో ప్రధానమైన పదవి లభిస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ గాలిలో జిల్లాలోని సిట్టింగ్ స్థానాలన్నీ ‘చే’జారిపోగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు.
 
 తన నాయకత్వ పటిమతో కారు జోరును తట్టుకుని నిలిచిన ఆయన జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు ధీటైన వాగ్ధాటి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయనకు సీఎల్పీ బాధ్యతలు అప్పగిస్తే భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ నాయకుల్లో గతంలో అసెంబ్లీలో గట్టిగా గళమెత్తింది జీవన్‌రెడ్డి అనే టాక్ ఉండటం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్.రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి హయాంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలకు జీవన్‌రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు.
 
 చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి అసెంబ్లీ టైగర్‌గా పేరు తెచ్చుకున్న విషయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే రీతిలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి పోరాడిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం తెలంగాణలో గెలుపొందిన కాంగ్రెస్ నేతల్లో ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ప్రథముడు కె.జానారెడ్డి కాగా, ఆరుసార్లు అసెంబ్లీకి వెళ్లిన వారిలో జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించిన అనుభవం సైతంకు ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానవర్గం జీవన్‌రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
 
 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందండం, సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన సారథ్యంపై సొంత పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ చైర్మన్ సీటు నుంచి పొన్నాలను దించడం ఖాయమనే వాదనలు వినిస్తున్నాయి. దీంతో జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా.. లేదా పార్టీ సారథిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ రెండింటిలో ఏదో ఒక పదవి కచ్చితంగా దక్కుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్న జీవన్‌రెడ్డిని పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పదవుల విషయం చర్చకు వస్తోంది. జీవన్‌రెడ్డి మాత్రం తనకు పదవి వచ్చినా.. రాకున్నా ప్రజల తరఫున పోరాడుతూ పార్టీ పటిష్టం కావడానికి కృషి చేస్తానని తనను కలిసిన వారితో చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో జీవన్‌రెడ్డి సమావేశం కానున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలు అధిష్టానానికి నివేదించనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు