ఓటరు నమోదు పెంపునకు క్లబ్‌లు 

12 Jan, 2018 01:43 IST|Sakshi

భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు జారీ

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో క్లబ్‌లు ఏర్పాటు 

భవిష్యత్‌ ఓటర్ల కోసం 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు..  

కొత్త ఓటర్ల నమోదుకు డిగ్రీ నుంచి ఉన్నత విద్య వరకు.. 

నిరక్షరాస్యుల్లో అవగాహన కలిగించేందుకు ‘చునావో పాఠశాల’ 

 

నల్లగొండ: దేశవ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియను పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్‌ యువతను లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్తగా క్లబ్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాలోని ఎన్నికల విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో యువతీ, యువకులను టీములుగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్లబ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. నిరక్షరాస్యులైన వారి కోసం ‘చునావో పాఠశాల’పేరుతో పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు కూడా ‘ఓటర్‌ అవేర్‌నెస్‌ ఫోరం’లు నెలకొల్పాలి. ఈ క్లబ్‌ల ద్వారా ఓటరు నమోదు పెంచడంతోపాటు, ఓటు ప్రాధాన్యతపై యువకుల్లో అవగాహన కలిగించాలి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలన్నది ఎన్నికల సంఘం అంతిమ లక్ష్యం. 

భవిష్యత్‌ ఓటర్ల కోసం: విద్యార్థులను భవిష్యత్‌ ఓటర్లుగా మార్చేందుకు పాఠశాలలు, కళాశాలల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో 9,10 తరగతి విద్యార్థులు, కాలేజీల్లో ఇంటర్‌ విద్యార్థులతో కలిపి క్లబ్‌లు ఏర్పాటు చేయాలి.  వీటికి  టీచరు, అధ్యాపకుడు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఓటరు విధానం, నమోదు ప్రక్రియ, ఎన్నికలు జరిగే విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారు.  

ఉద్యోగుల క్లబ్‌లు 
ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వేతర సంఘాలు క్లబ్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఓటరు అవేర్‌నెస్‌ ఫోరం(వీఏఎఫ్‌) అని పిలుస్తారు. ప్రభుత్వశాఖలవారీగా ఫోరంలు ఏర్పా టు చేసుకోవాలి. సంబంధిత శాఖ అధికారి ఫోరానికి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు.  

25 నాటికి పూర్తి చేయాలి  
మొదటి విడత జిల్లాలో 30 శాతం విద్యాసంస్థల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. ఈ నెల 25 నాటికి మొత్తం క్లబ్‌ల నియామకం పూర్తి చేయాలి. ఆ తర్వాత నుంచి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

జిల్లా కమిటీ 
క్లబ్‌ల పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా డీఆర్వో, సభ్యులుగా ఆర్డీఓలు, జెడ్పీసీఈఓ, డీఈఓ, ఆర్‌ఐఓ, వయోజన విద్యాధికారి, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్‌ఓ, డీఏఓ ఎన్‌ఐసీ, స్పోర్ట్స్‌ అధికారి, ఎన్‌జీ కాలేజీ ప్రిన్సిపల్, బాలికల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ ఉంటారు.   

కొత్త ఓటర్ల నమోదుకు..
డిగ్రీ, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కొత్త ఓటర్లుగా నమోదు చేసేందుకు డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్, మెడిసిన్‌ కాలేజీల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించేందుకు ఈ క్లబ్‌లు దోహద పడతాయి. ఎంపిక చేసిన విద్యార్థులతో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. అధ్యాపకులు నోడల్‌ అధికారులుగా   వ్యవహరిస్తారు. 

చునావో పాఠశాల 
పట్టణాల్లో, గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్‌ల పరిధిలో నిరక్షరాస్యులైన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి ఓటర్లుగా నమోదు చేయాలి. వీటిని చునావో పాఠశాలగా పిలు స్తారు. వీటికి పీఎస్‌ పరిధిలోని బూత్‌ స్థాయి అధికారి నోడల్‌ అధికారిగా పనిచేయాలి.   

మరిన్ని వార్తలు