హైదరాబాద్‌ నుంచి ‘క్లూ’స్‌ టీం

25 May, 2020 07:14 IST|Sakshi
సంఘటనా స్థలానికి వెళ్తున్న క్లూస్‌ టీం సభ్యులు

సంఘటన స్థలంలో పొద్దంతా ఆధారాల సేకరణ

హైదరాబాద్‌ నుంచి డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆరా..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృతుల ఘటన ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ పోలీసులను శనివారం ఆదేశించగా, కేంద్ర హోంశాఖ సైతం ఈ ఘటనపై ఆరా తీసింది. ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహేందర్‌ రెడ్డి కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే క్రమంలో ఆదివారం హైదరాబాద్‌ నుంచి డైరెక్టర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ‘క్లూ’స్‌ టీంను పంపించారు. ఆదివారం ఉదయమే వరంగల్‌కు చేరుకున్న ‘క్లూ’స్‌ టీం మొదట ఎంజీఎంలో మృతదేహాల నుంచి, ఆ తర్వాత గొర్రెకుంటలో ఘటన ప్రదేశమైన బావి, పక్కనే వారు నివాసం ఉండే ఇళ్ల నుంచి ఆధారాలను సేకరించారు.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి కేసు విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. హైదరాబాద్‌ సిటీ ‘క్లూ’స్‌ టీం హై సెక్యూరిటీ మధ్య నేర స్థలంలో ఆధారాలు సేకరించింది. ఈ బృందంలో క్రైమ్‌ సీన్‌ ప్రాసెసింగ్‌ ఆఫీసర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్‌తో పాటు ఎక్స్‌ఫర్ట్స్‌ ఉన్నారు. పాడుపడిన వ్యవసాయ బావితో పాటు, మృతులు నివాసం ఉండే ఇండ్లను ఉదయమే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బృందం  ‘క్రైం సీన్‌ డు నాట్‌ క్రాస్‌’ అన్న రిబ్బన్‌ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫొటోగ్రఫీ, వీడియో కెమెరాల ద్వారా నేరస్థలంలో సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడ కనిపించిన భౌతిక ఆధారాలను సేకరించారు. అంతకు ముందు ఎంజీఎంలో మృతదేహాలపై ఫింగర్‌ప్రింట్లతో పాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను సేకరించినట్లు ఆసుపత్రివర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు