‘సంఘమిత్ర’లో చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనే

11 May, 2016 04:54 IST|Sakshi
‘సంఘమిత్ర’లో చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనే

క్లూస్ టీం ఆధారంగా అన్వేషిస్తున్నాం
బందోబస్తు మరింత పెంచాం
రైల్వే ఎస్పీ ఎస్‌జే జనార్దన్

 
 
కాజీపేట రూరల్ : వరంగల్-ఖమ్మం రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన చోరీ అంతర్రాష్ట్ర దొంగల పనిగా భావిస్తున్నట్లు మంగళవారం రైల్వే ఎస్పీ ఎస్‌జె.జనార్దన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బెంగళూర్ నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర   బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు విజయవాడ తర్వాత వరంగల్‌లో హాల్టింగ్ ఉంది. వరంగల్ రాక  ముందే గుండ్రాతిమడుగు వద్ద అర్ధరాత్రి చైన్ లాగి రైలు నిలిపి ఎస్-2, ఎస్-8, ఎస్-9,ఎస్-11 బోగీల్లోకి ప్రవేశించి ఎస్-8, ఎస్-11లోని ఉన్న ఇద్దరు మహి ళ ప్రయాణికుల వద్ద రెండున్నర తులాల చెవి రింగులు, చైన్ చోరీ చేసి పారిపోయారు. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎస్కార్ట్‌గా ఉంటారు.

అయితే సోమవారం ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎస్కార్ట్ లేరు. దీనిని ఆసరాగా చేసుకొని దుండగులు చోరీ చే సినట్లు తాము భా విస్తున్నామని ఎస్పీ వివరించారు. బిహా ర్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర నుంచి వచ్చిన దొంగల పనే అయి ఉంటుందని ప్రాథమిక సమాచారంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్‌టీం ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు. చోరీ జరిగినట్లు తెలియగానే రైలు వద్దకు మహబూబాబాద్ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులు చేరుకున్నారని, బాధిత ప్రయాణికులను ఫిర్యాదు ఇవ్వమని కోరితే సమయం లేకపోవడంతో తాము పట్నాకు వెళ్లిన తర్వాత ఫిర్యాదు చేస్తామని అన్నారని చెప్పారు. సంఘమిత్ర ఘటనతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తిరిగే అన్ని రైళ్లలో, అన్ని రైల్వేస్టేషన్లలో పోలీస్ నిఘాను తీవ్రతరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే రైలులో ఉన్న రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.


 విచారణ ముమ్మరం చేశాం : జీఆర్పీ డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు
మహబూబాబాద్ : సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన దోపిడీ ఘటపపై విచారణ ముమ్మరం చేసినట్లు జీఆర్పీ డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జీఆర్పీ అవుట్‌పోస్ట్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని 5 నుంచి 10 మంది దొంగలు చోరీకి పాల్పడి ఉంటారన్నారు. ఎస్-8 మినహా మిగిలిన బోగీల్లో  దొంగలు చోరీకి యత్నించినా ఆభరణాల అపహరణ జరగలేదన్నారు.చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని, త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటామన్నారు. సమావేశంలో జీఆర్పీ సీఐ కె.స్వామి, ఎస్సై దేవేందర్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు