బాబుకు కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఖాయం

17 Jan, 2019 03:14 IST|Sakshi

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వ్యాఖ్య

యడ్లపాడు (చిలకలూరిపేట): సరైన సమయంలో సరైన విధంగా ఏపీ సీఎం చంద్రబాబు కు సీఎం కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండల కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాజకీయంగా టీడీపీ ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారన్న విషయం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని పేర్కొన్నారు.

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఖాయమని, అయితే అది ప్రత్యక్షమా పరోక్షమా అనే విషయాలు సస్పెన్స్‌ అని పేర్కొన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కలసి 60 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏపీ ప్రజలు కూడా నిజాయితీగా పనిచేసే నాయకుడికే పట్టం కడతారని, కుట్రలతో పరిపాలించే వ్యక్తులను దూరం పెడతారని జోస్యం చెప్పారు. ఓటుకు కోట్లు కేసు వల్లే ఏపీ సీఎం చంద్రబాబు అర్ధంతరంగా ఆంధ్రాకు పరుగు పెట్టారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పడ్డప్పుడు విద్యుత్, సాగునీరు సమస్య తీవ్రంగా ఉండేదని, సీఎం కేసీఆర్‌ చలవతో రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా, మిషన్‌ భగీరథతో తాగు, సాగునీరు సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్‌ పథకాలను కాపీకొట్టి మరో మోసానికి తెర తీశారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన పార్టీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలోని సగం మంది జీర్ణించులేకపోతున్నారని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు