గోదారి తడారదు : కేసీఆర్‌

20 Sep, 2019 01:47 IST|Sakshi

250 కి.మీ. ఉల్టా నడుస్తోంది.. కాళేశ్వరంతో అన్నీ అద్భుతాలే

రిజర్వాయర్‌గా మారిన వరద కాల్వ

పండుగ చేసుకుంటున్న ప్రజలు

సింగూరు, నిజాంసాగర్‌లను నింపుతాం

నెలలో ఎస్సారెస్పీ పునరుజ్జీవనం..

కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీలు తీసుకునే సౌలభ్యం

 శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజె క్టుతో అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని, ఇకపైనా అద్భుతమే జరుగుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టుతో ఆరునూరైనా 45 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందిస్తామని, గోదావరి నదిని సజీవం చేస్తామని తెలిపారు. ఇప్పటికే గోదా వరి 250 కిలోమీటర్లు ఉల్టా నడుస్తోందని, వరద కాల్వ అంతా పెద్ద రిజర్వాయర్‌గా మారిందని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపుతుండటంతో ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని చెప్పారు. పున రుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయినట్లేనని, ప్రస్తుతం సగం టీఎంసీ నీటిని తీసుకునేలా పంపులు సిద్ధం చేయగా, మరో 30 రోజుల్లోనే ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, బాల్క సుమన్‌ అడిగిన ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. 

ఎస్సారెస్పీకి టీఎంసీ నీరు..
‘పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే 0.5 టీఎంసీల నీటిని తరలించేలా ఐదేసి మోటార్లు సిద్ధమ య్యాయి. దీంతో ఎస్సారెస్పీ కింద 7 లక్షల ఎకరాలు స్థిరీకరణ అయినట్లే. ఇప్పటికే వరద కాల్వ.. రిజర్వాయర్‌గా మారడంతో 35 చెరు వులు నిండాయి. ఒక టీఎంసీ నీటిని మరో నెలలో ఎస్సారెస్పీకి తరలించే వ్యవస్థ సిద్ధమైతే, ఈ ఆయకట్టంతా సురక్షితమే’అని సీఎం కేసీఆర్‌ వివరించారు. గోదావరిలో సెప్టెంబర్‌ తర్వాత నీళ్లుండవని, అక్టోబర్‌లో 170 టీఎంసీలు, నవం బర్‌లో 40 నుంచి 50 టీఎంసీల లభ్యత ఉంటుం దని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 15 రోజులు ఉధృతంగా వర్షాలుండే అవకాశలుండటంతో.. కరెంటు ఖర్చు కావొద్దని ప్రస్తుతం కాళేశ్వరం పంపులు నడపట్లేదని తెలిపారు. ‘ఇప్పటికే మేడారంలో 129 మెగావాట్లు, గాయత్రి పంప్‌హౌజ్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 బాహుబలి మోటార్లలో 5 మోటార్లు సిద్ధమయ్యాయి. పదిహేను, ఇరవై రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. మరో 15 రోజుల్లోనే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునేలా వ్యవస్థ సిద్ధమవుతుంది. ఇందులో ఒక టీఎంసీని ఎంఎండీ, ఎల్‌ఎండీలకు తరలించి కోదాడ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందిస్తాం’అని ఆయన చెప్పారు.

అప్పులు సద్వినియోగం..
కాళేశ్వరం కోసం చేసిన అప్పులను సద్వినియోగం చేస్తున్నామని, ఈ ప్రాజెక్టుతో నిజాం సాగర్, సింగూరు ప్రాంతాలకు నీరిస్తామని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లు పూర్తయితే సింగూరు, నిజాం సాగర్‌ ప్రాజెక్టుల్లో ఎప్పుడూ నీరు లభ్యతగా ఉంటుందని వివరించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని రేగొండ మండల పరిధిలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఊరికి కాళేశ్వరం జలాలు వచ్చాయని, ఆయన సైతం దీనిపై హర్షం వ్యక్తం చేసినట్లు గుర్తు చేశారు. తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తులో నిర్మించి.. ఆదిలాబాద్‌ జిల్లలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని, ఇక్కడ లభ్యతగా ఉన్న 40 నుంచి 45 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తామని వివరించారు. అలాగే కుఫ్టి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు.

వీక్లీ ఆఫ్‌పై త్వరలో నిర్ణయం..
పోలీసులకు వీక్లీ ఆఫ్‌ఫై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ వెల్లడించారు. 10 రోజులకు ఓసారి ఆఫ్‌ ఇవ్వడమా.. లేదా వారానికోసారి ఇవ్వడమా... అన్న దానిపై డీజీపీ, హోం శాఖ కార్యదర్శి చర్చిస్తున్నట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణ, విపత్తుల నివారణను ఏకకాలంలో ఒకేచోట నుంచి పరిశీలించి అధ్యయనం చేసేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని మరో ప్రశ్నకు తెలిపారు.  

మరిన్ని వార్తలు