కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి రూ. 5 కోట్లు 

20 Jun, 2020 01:45 IST|Sakshi

ఆయన భార్యకు గ్రూప్‌–1  ఉద్యోగం, నివాస స్థలం 

స్వయంగా ఇంటికి వెళ్లి అందిస్తా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

మరో 19 మంది అమర జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున సాయం

సాక్షి, హైదరాబాద్‌: సరిహద్దులో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేట జిల్లావాసి కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌ బాబు కుటుంబానికి రూ. 5 కోట్ల నగదుతోపాటు నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తానే స్వయంగా కల్నల్‌ సంతోష్‌ ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది అమర జవాన్ల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి ద్వారా అందిస్తామన్నారు. 

ఆ కుటుంబాలను ఇతర రాష్ట్రాలూ ఆదుకోవాలి
‘సరిహద్దులో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్‌ దేశం అండగా నిలవాలి. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. కేంద్రానికి  అండగా రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సూచించారు.  

సంతోష్‌ తల్లిదండ్రుల  కృతజ్ఞతలు 
సూర్యాపేట అర్బన్‌: దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్‌ రూ.5 కోట్లు, ఇంటి స్థలం, సంతోష్‌బాబు సతీమణికి గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం స్వయంగా వారి ఇంటికే వచ్చి ఇస్తానని ప్రకటించడం పట్ల ఆయన కుటుంబసభ్యులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటలోని సంతోష్‌ ఇంటి వద్ద తండ్రి ఉపేందర్, తల్లి మంజుల చేతులెత్తి నమస్కరిస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. 

మరిన్ని వార్తలు