వరాల వర్షం..

25 Aug, 2018 01:13 IST|Sakshi
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

19 కులాలకు ప్రత్యేకంగా భవనాలు, నిధులు 

మున్నూరు కాపులకు ఐదెకరాలు, రూ.5 కోట్లు 

36 సంచార కులాలకు 10 ఎకరాల్లో భవనం  

ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ 

వచ్చే నెల నుంచి అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత 

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అర్చకులు, మౌజన్, ఇమామ్‌లకు, చిరుద్యోగులకు ఒకేరోజు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నేపథ్యంలో సీఎం ప్రకటనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని కులాల వారు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ భవనాల కోసం కోకాపేట, ఘట్‌కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇంజాపూర్‌ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు, మహేశ్‌దత్‌ ఎక్కా, శివశంకర్, దాన కిశోర్, బుద్ధప్రకాశ్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించారు. ‘రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వీటితోపాటు వారి వికాసానికి ఉపయోగపడేలా ప్రతీ కులానికి హైదరాబాద్‌లో ప్రభుత్వమే భవనాలను నిర్మిస్తుంది. దీనికి అవసరమైన స్థలాలను సేకరించాం. నిధులు సిద్ధంగా పెట్టాం.

దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్‌ నిర్మిస్తాం. ఇందులో అన్ని సంచార కులాల అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు, ఎస్సీల్లోని బుడగ జంగాలు, ఎస్టీల్లోని ఎరుకల కులానికి స్థలం కేటాయించి, భవన నిర్మాణానికి నిధులివ్వాలని నిర్ణయించాం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం దేశంలోనే ఇదే తొలిసారి. రాష్ట్రం మత సామరస్యానికే కాదు.. సామాజిక వికాసానికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. మిగిలిన కులాలకు స్థలాలు, నిధులు కేటాయిస్తున్నాం.

మున్నూరు కాపులకు 5 ఎకరాలు, రూ.5 కోట్లు... దూదేకులకు 3 ఎకరాలు, రూ.3 కోట్లు... గంగపుత్రులకు, విశ్వకర్మలకు 2 ఎకరాలు, రూ.2 కోట్లు... నాయీ బ్రాహ్మణులు, ఆరె క్షత్రియులు, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేర, బుడిగ జంగాల, మేదర, పెరిక, చాత్తాద శ్రీవైష్ణవ, కటిక, ఎల్లాపి, బొందిలి కులస్తులకు ఒక్కో ఎకరం, రూ.కోటి... బట్రాజులకు అర ఎకరం, రూ.50 లక్షలు కేటాయిస్తున్నాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అన్ని కులాలకు స్థలం, నిధులు కేటాయించినందున వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయా శాఖల మంత్రులకు, అధికారులకు, కుల సంఘాలకు ఆయన సూచించారు. 

101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌... 
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఇంటి అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని... టీవీలు, ఇతర విద్యుత్‌ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్‌ వినియోగం ఎక్కువైందని పేర్కొన్నారు. అందుకే 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికయ్యే విద్యుత్‌ చార్జీలను డిస్కమ్‌లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. 

అర్చకుల పదవీ విరమణ 65 ఏళ్లకు.. 
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నేరుగా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్చకులకు సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు అందుతాయన్నారు. పూజారుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. జీతాల చెల్లింపు, పదవీ విరమణ వయోపరిమితి పెంపు విధి విధానాలు తయారు చేసి సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.  

ఇమామ్, మౌజన్‌ల భృతి రూ.5వేల పెంపు... 
మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్‌లకు నెలకు రూ.5 వేల భృతి ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు. సెప్టెంబర్‌ 1 నుంచే పెరిగిన భృతి చెల్లించనున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో మౌజమ్, ఇమామ్‌లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భృతి ఉండేది. ఆ తర్వాత రూ.1500కు పెంచారు. సెప్టెంబర్‌ 1 నుంచి పెరగనున్న భృతితో దాదాపు 9వేల మందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. 

మినీ గురుకులాల్లో ఉద్యోగుల వేతనాల పెంపు... 
రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. హెడ్‌మాస్టర్‌/వార్డెన్‌కు రూ.5 వేల నుంచి రూ.21 వేలకు, సీఆర్టీలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు, పీఈటీలకు రూ.4 వేల నుంచి రూ.11 వేలకు, అకౌంటెంట్‌కు రూ.3,500 నుంచి రూ.10 వేలకు, ఏఎన్‌ఎంలకు రూ.4 వేల నుంచి రూ.9 వేలకు, వంటవారికి రూ.2,500 నుంచి రూ.7,500కు, ఆయాలకు రూ.2,500 నుంచి రూ.7,500కు, హెల్పర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్‌మెన్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతున్నామన్నారు. వేతనాల పెంపు ప్రతిపాదనల ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం సంతకం చేశారు. 

మరిన్ని వార్తలు