ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

23 Jul, 2019 09:32 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: గ్రామస్తులనుద్ధేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనకు ఇంత చేసిన చింతమడక గ్రామం రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామస్తులతో కలిసి ఉండాలనే కోరిక చాలా కాలం తర్వాత నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన గ్రామస్తులు ఆరోగ్యం, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందుకోసం నిధులు మంజూరు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.

గ్రామంలో ఉన్నవారికే కాకుండా గ్రామం నుంచి బతుక పోయిన వారికి కూడా మొత్తం ఎంతమంది అయినా అందరికీ లబ్ధి చేకూర్చాలన్నాదే తన ఆలోచన అన్నారు.  ఇందుకోసం ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ప్రతీ కుటుంబం ఆర్థికంగా వృద్ధి చెందేందుకు రూ. 10 లక్షలకు తక్కువ కాకుండా సాయం అందచేస్తానని చెప్పారు. ఇందుకోసం రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

చింతమడక, మదిర గ్రామాలు ఉప్పలోని కంట, దమ్మచెరువు గ్రామాలే కాకుండా గ్రామం నుంచి విడిపోయిన మాచాపూర్, సీతారంపల్లి గ్రామాలు కలిపి మొత్తం 2 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తానని చెప్పారు. ఈ డబ్బులతో వారి వారి నైపుణ్యాల ఆధారంగా యూనిట్లు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. 

స్నేహపూర్వక వాతావరణంలో నా గ్రామం ఉంటే నానే సంతోషపడుతానని  ఈ సందర్భంగా చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, యువజన సంఘాలు కలిసి సంఘాలుగా ఏర్పడి మంచి పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇటీవల అభివృద్ధి చేసిన ఎర్రవల్లి గ్రామాన్ని  ఆదర్శంగా తీసుకొని మన గ్రామం అందంగా తయారు కావాలని చెప్పారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్రామం మోడల్‌గా తయారు కావాలని. కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరీ శుభాష్‌రెడ్డి, సివిల్‌ సప్‌లై కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,  కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాసరావు, సీపీ జోయల్‌ డేవిస్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు