పాతబస్తీకి రూ. వెయ్యి కోట్లు

17 Apr, 2018 02:08 IST|Sakshi
పాతబస్తీలో మౌలిక వసతులపై సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో ఎంపీ అసదుద్దీన్‌ తదితరులు

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళిక

రంజాన్‌కు ముందే పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన హైదరాబాద్‌ పాతబస్తీలో రూ. వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వరదలు, మురుగునీరు ప్రవ హించని, విద్యుత్‌ సమస్యలు, మంచినీటి ఎద్ద డి, ట్రాఫిక్‌ సమస్యలు లేని ప్రాంతంగా పాతబస్తీని తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని అన్నారు. రంజాన్‌ నెల ప్రారంభానికి ముందే తాను పాతబస్తీలో పర్యటించి పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు. అప్పటికల్లా ప్రణాళిక రూపొందించాలని, అన్ని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేలా ప్రణాళక ఉండా లని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెలకు 2సార్లు పాతబస్తీ అభివృద్ధి పనులపై సమీక్షించాలని సూచించారు. రూ.1,600 కోట్లతో చేపట్టే మూసీ నది ప్రక్షాళన, ఆధునీకరణ పనులను, రూ.1,200 కోట్లతో చేపట్టిన మెట్రో రైలు పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో మౌలిక వసతులపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవై సీ, సీఎస్‌ ఎస్‌.కె.జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, హైద రాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సివరేజి బోర్డు ఎండీ దానకిషోర్, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, రాజేశ్వర్‌ తివాకీ, వాకాటి కరుణ, అరవింద్‌కుమార్, హైదరా బాద్‌ కలెక్టర్‌ యోగిత, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్‌ పాల్గొన్నారు. 

సమైక్య పాలనలో నిర్లక్ష్యం... 
సమైక్య పాలనలో పాతబస్తీ చాలా నిర్లక్ష్యానికి గురైందని, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పాతబస్తీలో విద్యుత్‌ కోత, మంచినీటి ఎద్దడి, రోడ్లు సరిగా లేవని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని తాను 30 ఏళ్ల నుంచి వింటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని, సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని ఆదేశించారు. 

కొత్తగా ఐదు సబ్‌స్టేషన్లు... 
‘పాతబస్తీలో నాణ్యమైన విద్యుత్‌ అందించేం దుకు కొత్తగా ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాలని తలపెట్టాం. వెంటనే స్థల సేక రణ చేపట్టి నిర్మాణాలు ప్రారంభించాలి. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యకనుగుణంగా రోలింగ్‌ స్టాక్‌ను ఏర్పాటు చేయాలి. పాతబస్తీలోనే ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుకు షెడ్డు ఏర్పాటు చేయాలి. రంజాన్, వినాయక చవితి, బోనా ల పండుగలు వరుసగా వస్తున్నందున విద్యుత్‌ వినియోగం ఎక్కువవుతుంది. తగిన ఏర్పాట్లు చేయాలి. విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపర్చడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

మంచినీటి ఇబ్బంది రావద్దు... 
‘హైదరాబాద్‌ నగరం తెలంగాణకు గుండెకాయ. మంచినీటికి ఇబ్బంది రావద్దు. నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం కృష్ణా నుంచి 3 దశల్లో 16.5 టీఎంసీలు, గోదావరి ద్వారా 10 టీఎంసీల నీరు వస్తోంది. సింగూ రు, హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) ప్రత్యామ్నాయ వనరులుగా ఉన్నాయి. 10 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో హైదరాబాద్‌ మంచినీటి అవసరాలకు కేశవా పురం రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. వీటికితోడు ఓఆర్‌ఆర్‌ చుట్టూ చిన్న రిజర్వాయర్లు నిర్మించి నీటిని నిల్వ చేసుకోవాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

నూతన పైప్‌లైన్లు... 
మంచినీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. పాతబస్తీలో ఏడు చోట్ల మంచినీటి రిజర్వాయర్లు నిర్మించాలి. నిజాం కాలం నాటి పైపులైన్లే ఇప్పటికీ ఉన్నాయి. వాటిని మార్చాలి. కొత్త, పెద్ద పైపులైన్లు వేయాలి ప్రతీ బస్తీకి, ప్రతీ ఇంటికి మంచినీరు అందాలి.  

మూడు కొత్త వంతెనలు 
‘ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్‌లో అమలు చేస్తున్న స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో పాతబస్తీలో చేపట్టిన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి. మూడు కొత్త వంతెనలు నిర్మించాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాన పనులకు అంచనాగా రూ. వెయ్యి కోట్లు అవసరమని, వెంటనే నిధులు సమకూరుస్తామని, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 

200 బస్తీ దవాఖానాలు 
‘ఇటీవల ప్రారంభించిన బస్తీ దవాఖానా లకు మంచి స్పందన వచ్చింది. నగరంలో 200 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలి. వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. నగరంలో వీలైనన్ని ఎక్కువ చోట్ల డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభించాలి’’అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

నాలాల ఆధునీకరణ, కాల్వల నిర్వహణ: 
రూ. 200 కోట్ల వ్యయంతో నాలాల ఆధునీకరణ, వెడల్పు పనులను వెంటనే ప్రారంభించాలి. ఎంత వర్షం వచ్చినా పాతబస్తీలో వరద రాని పరిస్థితి ఉండాలి. కాల్వల నిర్వహణ సరిగా లేక మురుగునీరు రోడ్లు, ఇళ్లల్లోకి వస్తోంది. అందువల్ల మురుగు కాల్వలను వందకు వందశాతం బాగు చేయాలి. ఎక్కడా మురుగునీరు బయటకు రాకుండా చూడాలి’అని సీఎం సూచించారు. 

మరిన్ని వార్తలు