రాష్ట్రానికి జీవధార

11 Aug, 2017 02:31 IST|Sakshi
రాష్ట్రానికి జీవధార
  • శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకంతో రాష్ట్రం సస్యశ్యామలం
  • పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • అనంతరం బహిరంగ సభలో ప్రసంగం
  • ఏడాదిలోగా ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు
  • ఆగమేఘాలపై పనులు పూర్తి చేస్తాం
  • వచ్చే ఖరీఫ్‌ నాటికి నీళ్లు అందిస్తాం
  • ఇక ముందు ఏటా శ్రీరాంసాగర్‌ పూర్తిగా నిండుతుంది
  • తెలంగాణ సాధిస్తానని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కట్టమీదే ఆన చేసిన
  • అనుకున్నట్లుగానే తెలంగాణ సాధించుకున్నం
  • ఆంధ్రా పాలకుల ప్రాజెక్టులు మోసపూరితం.. అవేవీ నీళ్లిచ్చేవి కాదు
  • టీఆర్‌ఎస్‌ సర్కారుకు పేరు రావొద్దనే కాంగ్రెస్‌ నేతల కుట్రలు
  • కేసులతో ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నరు
  • వారిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు
  • సాక్షి, నిజామాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం రాష్ట్రానికి జీవధార అని.. దీనితో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆగమేఘాలపై ఈ పథకం పనులు పూర్తిచేస్తామని... వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం పూర్తయితే ఏటా ఫిబ్రవరి, మార్చిలోగా 90 టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టులోకి వస్తాయని పేర్కొన్నారు.

    నిజామాబాద్‌ జిల్లాలోని పోచంపాడ్‌ వద్ద శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం పనులకు కేసీఆర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు వరద కాలువ జీరో పాయింట్‌ వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ఒక్కసారి ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుకొంటే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. బాల్కొండ, మెట్‌పల్లి, వేములవాడ, మానకొండూర్‌ నియోజకవర్గాల నుంచి వెళ్లే వరద కాలువలో ఏడాదంతా నీటి నిల్వ ఉంటుందన్నారు. తద్వారా చేపలు, చెట్లు, నేలలో తేమశాతం పెరుగుతుందని.. ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమవుతుందని వ్యాఖ్యానించారు.

    ఆంధ్రా పాలకులు కట్టిన ప్రాజెక్టులు మోసపూరితం
    ఎస్సారెస్పీకి పునాదిపడి 54 ఏళ్లు గడిచినా ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2, వరద కాలువ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పనులన్నింటిని తాము పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రా పాలకులు కట్టిన ప్రాజెక్టులన్నీ మోసపూరితమైనవని, అవి నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాదని ఆరోపించారు. 2001లో గులాబీ జెండా ఎగురవేసిన తర్వాత జలసాగర్‌ ఉద్యమం చేశామని గుర్తు చేశారు. ‘‘ఆంధ్రా పాలనలో ఇచ్చంపల్లి ఇచ్చకాయల పాలైంది.. నిజాంసాగర్‌ వట్టిపోయింది.. మెదక్‌ జిల్లా ఘనపురం నాశనమైంది.. దిండిలో బండలు తేలినయి.. కోయల్‌సాగర్‌ను కొంగలు ఎత్తుకెళ్లినయి.. అప్పర్‌ మానేరు అడుగంటింది.. చెరువులన్నీ తాంబాలాల్లెక్క మారినయి..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని.. ఈ తరుణంలో సాగునీటి కోసం మొదటిదశలో మిషన్‌ కాకతీయ చేపట్టి చెరువులను బాగు చేసుకునే పనులు ప్రారంభించామని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి గోదావరి, కృష్ణా జలాలను ఆయకట్టుకు తరలించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

    ఆనకట్టపైనే ఆన చేసిన..
    ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని 1996లో శ్రీరాంసాగర్‌ ఆనకట్ట మీద ఆన చేశానని.. అనుకున్నట్లుగానే తెలంగాణ సాధించానని కేసీఆర్‌ చెప్పారు. ‘‘1996లో ఉప ఎన్నిక కోసం నిర్మల్‌కు వచ్చిన సందర్భంగా ఎస్సారెస్పీని సందర్శించిన. అప్పుడు ప్రాజెక్టు గేట్లకు గ్రీజ్, ఆయిల్‌ లేదు.. తాళ్లు సిలుమెక్కినయి. కట్టపై రోడ్లు మోకాళ్ల లోతు గుంతలు పడ్డయి. అదే ఆంధ్రాకు నీటిని తీసుకెళ్లే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు మాత్రం వైష్ణవాలయంలా ధగధగలాడుతుంటే... తెలంగాణ ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ శివాలయంలా తయారైందని ఆ రోజే నా స్నేహితుడైన సత్యనారాయణగౌడ్‌కు చెప్పిన. అన్యాయం ఎక్కువైతే తిరుగుబాటు వస్తుందని, మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చి తీరుతుందని చెప్పిన. అసలు నేనే ఉద్యమం ప్రారంభిస్తానని ఆనకట్ట మీద ఆన చేసిన.. అనుకున్నట్లుగనే తెలంగాణను సాధించుకున్నం..’’అని పేర్కొన్నారు. ఇప్పడు తానే ముఖ్యమంత్రి హోదాలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

    కాంగ్రెసోళ్లను నిలదీయండి
    ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై 96 కేసులు వేశారని... సుందిళ్ల, అన్నారం, మల్లన్నసాగర్, పాములపర్తి రిజర్వాయర్ల విషయంలో పంచాయితీలు పెడుతున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు 4,600 ఎకరాలు అవసరమైతే 4,510 ఎకరాల భూసేకరణ పూర్తయిందని... కేవలం 90 ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్‌ నేతలు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. 25 రోజుల్లో 6 కేసులు వేశారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని.. మౌనం పాటిస్తే మనం నష్టపోతామని పేర్కొన్నారు.

    యాసంగి నుంచి 24 గంటల విద్యుత్‌
    తెలంగాణ వచ్చాక రాత్రింబవళ్లు కష్టపడి రాష్ట్రంలో కరెంట్‌ బాధలు లేకుండా చేసుకున్నామని కేసీఆర్‌ చెప్పారు. వచ్చే యాసంగి నుంచే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు తెలంగాణ ప్రజలను ఏడిపించారని... వారి పాలనలో ట్రాన్స్‌ఫార్మర్లు, బోర్లు కాలిపోతుండేవని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మహిళలు వడ్డీలేని రుణాలు కోరుతున్నారని, వెంటనే రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    నాలుగు జీవధారలతో సస్యశ్యామలం
    నాలుగు జీవధారలతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పెన్‌గంగ వంటి మొదటి జీవధార ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తోందన్నారు. రెండో జీవధార రాష్ట్రంలో 200 కిలోమీటర్లపైన ప్రవహించే గోదావరి నది అని.. అది ఎప్పటికీ 70, 80 టీఎంసీలతో నిండి ఉంటుందని తెలిపారు. ఇక మూడో జీవధార ఎస్సారెస్పీ వరద కాలువ అని, ఇది శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపడంతో పాటు, నిర్మల్, నిజామాబాద్, లోయర్‌మానేరు, మిడ్‌ మానేర్‌ మీదుగా వరంగల్‌ దాటి పోతుందని చెప్పారు. నాలుగో జీవధార మిడ్‌మానేరు నుంచి అనంతగిరి, రంగనాయకి సాగర్, బస్వాపూర్‌ రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్‌ వరకు కొనసాగుతుందన్నారు. తాను ఈ అంశాన్ని మంత్రులందరికీ చెప్పానని, ప్రజలకు వివరించాలని సూచించామని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో 40 లక్షల నుంచి 45 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతుందని చెప్పారు.


    ప్రాజెక్టు వరద కాల్వ జీరో పాయింట్‌ వద్ద నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు

    రాష్ట్ర నాయకత్వమంతా హాజరు..
    దాదాపుగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం మొత్తం పోచంపాడు బహిరంగ సభకు హాజరైంది. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల, తలసాని, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు డీఎస్, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, వినోద్‌కుమార్, బాల్క సుమన్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, హన్మంత్‌ షిండే, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్‌ సమస్య కారణంగా మంత్రి కేటీఆర్‌ సభా స్థలానికి చేరుకోలేక వెనుదిరిగారు.

    రాష్ట్రానికి ఊపిరినిచ్చే ప్రాజెక్టు ఇది: హరీశ్‌
    శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఊపిరినిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అతి తక్కువ ఖర్చు, అతి తక్కువ ముంపు, అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు ఇది నీరందించగలదని తెలిపారు. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై కేసీఆర్‌ ఈ ప్రత్యేక పథకానికి రూపకల్పన చేశారని కొనియాడారు. కాళేశ్వరం నీటిని తరలించేందుకు అవసరమైతే మూడు షిఫ్టుల్లో ఉద్యోగులతో పని చేయించాలని సీఎం సూచించారని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వచ్చే నీటి శాతం తగ్గిపోతోందని.. దాంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం ఆదేశాలను ఓ భగవద్గీత, ఓ ఖురాన్‌లా పవిత్రంగా భావించి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాగునీటి పథకాలతో టీఆర్‌ఎస్‌కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారన్నారు.

    ట్రాఫిక్‌లో ఇరుక్కున్న కేటీఆర్‌
    – సభకు వెళ్లకుండానే వెనక్కి..
    – సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన యువకులు

    భీమ్‌గల్‌ (బాల్కొండ): పోచంపాడ్‌ వద్ద బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. సీఎం సభకు వచ్చిన వాహనాలతో జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దాంతో మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. కొద్దిసేపు ప్రయత్నించి.. సభా స్థలం సమీపం వరకు వెళ్లగలిగారు. అయితే అప్పటికే సభ పూర్తయి కేసీఆర్‌ వెళ్లిపోవడంతో.. కేటీఆర్‌ వెనుదిరిగారు. అయితే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన సమయంలో సభకు వస్తున్న యువకులతో కేటీఆర్‌ సరదాగా సెల్ఫీలు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో యువకులు ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.
     

మరిన్ని వార్తలు