ఆ విధానం బ్రహ్మ పదార్థం కాదు : ​కేసీఆర్‌

18 May, 2020 18:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదు. ఎక్కడ, ఎప్పడు ఏ పంట వేయాలో, ఎంత విస్తీర్ణంలో వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే నియంత్రిత పంటల విధానం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మన శాస్త్రజ్ఞులు మంచి దిగుబడి వచ్చే పంటలనే సూచిస్తారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన వానాకాలం సీజన్‌లో వ్యవసాయ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వీటిలో పూర్తిగా వరి పంట వేస్తే నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని, అంత పెద్ద మొత్తంలో వరి వస్తే తట్టుకునే శక్తి, బియ్యం తయారు చేసే శక్తి మన రైస్‌ మిల్లులకు లేదన్నారు. అందుకే ఇతర పంటలను సైతం రైతులు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పంటలు వేసే ముందు లాభసాటి అంశాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి : తెలంగాణలో ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌..!)

 ‘కరోనా వల్ల ఈ ఏడాది వరి ధాన్యాన్ని కొన్నాము.. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలం. రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారు. మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుంది. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు.

గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశాం. ఈసారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలి. 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చు. ఇందులో దొడ్డు రకాలు.. సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు. 12 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేద్దాం.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాలంటే యాసంగి లో మొక్కజొన్న వేయండి.  ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి, కూరగాయలు, సోయా, పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయండి. ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారితో ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది’  అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు

మరిన్ని వార్తలు