ఎమ్మెల్యే సండ్రకు సీఎం అభినందన

14 Mar, 2020 08:20 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ కారాయిగూడెం వైకుంఠధామం ఫొటో చూపిస్తున్న దృశ్యం

సాక్షి, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో నిర్మించిన వైకుంఠధామం ఫొటోలను అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేసీఆర్‌ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్పంచ్‌ దొడ్డపునేని శ్రీదేవి బ్రహ్మాండంగా వైకుంఠధామాన్ని పార్కులా.. దేవాలయంలా కట్టారు. సండ్ర వెంకటవీరయ్య చెప్పింది చాలా కరెక్ట్‌.. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా చాలా నిర్మించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సర్పంచ్‌ దొడ్డపునేని శ్రీదేవి, గ్రామ ప్రజలు, అధికారులకు అభినందనలు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించారు. చాలా సంతోషం వేసిందని కితాబిచ్చారు. 

పల్లెప్రగతి సంతృప్తినిచ్చింది..
పల్లెప్రగతి కార్యక్రమం తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో తెలిపారు. మనిషి చనిపోతే తీసుకెళ్లాలంటే కొట్లాటలు జరిగిన ఘటనలు చూశానని, ఎన్నికలు వస్తే ముందు శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తేనే ఓటు వేస్తామని చెప్పేవాళ్లు ఉండేదని, వీటన్నింటికి పరిష్కారం పల్లెప్రగతి చూపించిందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 143 గ్రామపంచాయతీలు ఉంటే అన్నింట్లో ట్రాక్టర్లు కొనడమే కాకుండా.. వైకుంఠధామాల నిర్మాణాలు కూడా 143 పంచాయతీల్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి వేలాది మంది సమక్షంలో ప్రారంభించి.. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు.


అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

శ్మశానవాటికలు అందంగా ఉండాలని దాతల సాయంతో ఒక శివుడి విగ్రహాన్ని నిర్మించామని, మనిషి పుట్టుక ఎంతగొప్పదో.. చనిపోయిన తర్వాత అంతే పవిత్రంగా ఆ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలిగే విధంగా వాటిని నిర్మించామన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు పంచాయతీ జిల్లాలోనే బెస్ట్‌ పంచాయతీగా కలెక్టర్‌ ఎంపిక చేశారని, ఆ పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించారని.. ప్లాస్టిక్‌ గ్లాస్, ప్లాస్టిక్‌ బ్యాగ్‌ వాడినా మహిళా సర్పంచ్‌ ఫైన్‌ వేస్తారని వెల్లడించారు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ పర్యటనకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆహ్వానించారు. 

మరిన్ని వార్తలు