గట్టెక్కిన గ్రిడ్‌! 

6 Apr, 2020 02:30 IST|Sakshi

సాగర్‌ రివర్స్‌ పంపింగ్, కాళేశ్వరం ఎత్తిపోతలు నడిపి కృత్రిమ డిమాండ్‌ సృష్టి

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ, ఇంజనీర్లకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్‌ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్‌ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యుత్‌ వినియోగంలో మార్పులు సంభవించినా, ఉత్పత్తి – సరఫరా మధ్య సమతూకం సాధించడంలో జెన్‌ కో, ట్రాన్స్‌ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం నుంచి జెన్‌ కో– ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్‌ సౌధలోని లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌లోనే ఉండి విద్యుత్‌ డిమాండ్‌ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం రచించారు. దానికి అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్‌ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1,500 మెగావాట్ల డిమాండ్‌ పడిపోయింది.

మూడు రెట్ల విద్యుత్‌ డిమాండ్‌ పతనం... 
ఆదివారం రాత్రి 9 గంటలకు ముందు రాష్ట్రంలో 7,380 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా, 9 గంటల తర్వాత 5,800 మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్రమంతటా ఇళ్లల్లో విద్యుత్‌ దీపాలను బంద్‌ చేస్తే గరిష్టంగా 300–500 మెగావాట్ల డిమాండ్‌ మాత్రమే తగ్గనుందని కేంద్ర విద్యుత్‌ ప్రాధికారత సంస్థ (సీఈఏ) అంచనా వేయగా, దాని కన్నా మూడు రేట్లు అధికంగా విద్యుత్‌ డిమాండ్‌ పతనమైంది. అయినా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌) కుప్పకూలకుండా లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎల్డీసీ) ఇంజనీర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కసారిగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా తగ్గడం తో గ్రిడ్‌ను బ్యాలెన్స్‌ చేసేందుకు నాగార్జునసాగర్‌ రివర్స్‌ పంపింగ్‌ కేంద్రంలోని నాలుగు యూనిట్లను నడపడం ద్వారా 400మెగావాట్ల విద్యుత్‌ను, మేడారంలోని కాళేశ్వరం పంపింగ్‌ స్టేషన్‌ను నడపడం ద్వారా మరో 300 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఇలా మొత్తం 700 మెగావాట్ల కృత్రిమ విద్యుత్‌ డిమాండ్‌ను సృష్టించడంతో పాటు మరో 800 మెగావాట్ల వరకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడం ద్వారా గ్రిడ్‌ బ్యాలెన్సింగ్‌ను పరిరక్షించారు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి– సరఫరాల మధ్య సమతూకం కుదిరింది. విద్యుత్‌ దీపాలను మళ్లీ వెలిగించడంతో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌ పుంజుకుని పూర్వస్థితికి చేరింది. లైట్లు ఆర్పేసినా విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన విద్యుత్‌ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు