సగం ప్రైవేటీకరించినట్టేనా...?

7 Oct, 2019 03:12 IST|Sakshi

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగుల సంఖ్య 51,150

ప్రస్తుతం సమ్మెలో ఉన్నది 49,950

ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,400

ఇందులో అద్దె బస్సులు 2,150

సాక్షి, హైదరాబాద్‌ :దేశంలోనే ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఉన్నతమైంది అనగానే కర్ణాటక ఆర్టీసీతోపాటు ఏపీఎస్‌ ఆర్టీసీ ఠక్కున గుర్తుకొస్తుంది.రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్‌ ఆర్టీసీ రెండుగా విడిపోయి ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ ఆవిర్భవించింది.దాదాపు 1.20 లక్షల ఉద్యోగుల్లో తెలంగాణకు 52 వేల మంది వరకు వచ్చారు. వారిలో పదవీ విరమణ చేసినవారు పోను ప్రస్తుతం 51 వేల మంది ఉన్నారు. పరిమాణంలో చిన్నదిగా మారినా ఇప్పటికే దేశవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీకి మంచి గుర్తింపే ఉంది. గత ఐదేళ్లుగా ఠంచన్‌గా కేంద్రప్రభుత్వం నుంచి వివిధ కేటగిరీల్లో పురస్కారాలు పొందుతోంది.

తాజాగా సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ఇప్పుడు ఈ సంస్థ మరోరకంగా వార్తల్లోకెక్కుతోంది. సంస్థ మనుగడ మెరుగ్గా ఉండాలంటే సమతూకం అవసరమంటూ సగం ప్రైవేటు బస్సులే ఉండాలని ఆయన ప్రకటించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఫలితంగా సంస్థలో సగం వంతు ప్రైవేటీకరణ జరిగినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ఆర్టీసీలో 25 శాతం వరకు అద్దెబస్సులు సమకూర్చుకునే వీలుంది. గతంలో 18 శాతంగా ఉన్న దీన్ని రెండేళ్ల క్రితం 25 శాతానికి పెంచారు. సొంత బస్సులు కొనేందుకు నిధులు లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2015లో కార్మికుల జీతాలు భారీగా పెరగటంతో కొత్త బస్సులకు సొంత సిబ్బందిని నియమించుకోవటం ఆర్థికంగా భారంగా మారి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్రమంగా అద్దె బస్సుల సంఖ్య 21 శాతానికి చేరుకుంది. దీన్ని కార్మికులు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా దాన్ని 50 శాతానికి పెంచనుండటంతో కార్మికులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా