యాదాద్రి ఆలయ పనుల జాప్యంపై కేసీఆర్‌ ఫైర్‌

18 Aug, 2019 01:39 IST|Sakshi
శనివారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఐదేళ్లయినా పనులు పూర్తవుతాయా?..

ఫిబ్రవరిలో యాగం చేద్దామనుకున్నా 

ఇక్కడ చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయ్‌ 

కావాల్సిన నిధులిస్తా.. వెంటనే పనులు పూర్తి కావాలి 

మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి 

అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టీకరణ 

రెండున్నర గంటలపాటు నిర్మాణ పనుల పరిశీలన 

అధికారులతో ఐదు గంటలపాటు సమీక్ష 

ఇప్పటివరకు పనుల కోసం 692 కోట్ల వ్యయం

పనులు జాప్యం చేసిన ఆర్‌అండ్‌బీ ఈఈపై వేటు

ప్రధాన ఆలయం పనుల్లో సింహభాగం పూర్తయింది. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలాయి. వాటి పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. టెంపుల్‌ సిటీలో 250 కాటేజీలు నిర్మించాలి. ఇందుకోసం దాదాపు రూ. 400 కోట్ల విరాళాలు ఇవ్వడానికి వివిధ కార్పొరేట్‌ సంస్థలు, దాతలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే కాటేజీల డిజైన్లు రూపొందించి నిర్మాణం ప్రారంభించాలి. భూసేకరణ త్వరగా పూర్తి చేసి ప్రధాన రహదారులన్నీ వెడల్పుగా నిర్మించాలి. చెరువు కింది భాగంలో పురుషులు, మహిళలకు వేరువేరుగా కళ్యాణ కట్టలు, నీటి కొలనులు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి.  – కేసీఆర్‌

సాక్షి, యాదాద్రి/హైదరాబాద్‌ : ‘‘ఫిబ్రవరిలో యాగం చేద్దామనుకున్నా.. అందరినీ పిలిచి దేవుడికి దండం పెడదాం అనుకున్నా.. పనులు ఇలా జరిగితే ఎలా? ఇంకా ఐదేళ్లు పడతాయా ఈ పనులు జరగడానికి? మీకైనా ఉండాలి.. నాకైనా ఉండాలి.. ఇలా ఎన్నిసార్లు మాటలు చెబుతారు? గర్భాలయ పనులతో పాటు మిగతా పనులన్నీ సమాంతరంగా పూర్తి చేయాలని గత ఫిబ్రవరిలో వచి్చనప్పుడు చెప్పాను. కానీ, ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తే ఎక్కడివి అక్కడే ఉన్నాయి’’అని యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనుల జాప్యంపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. శనివారం ఆయన ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను పరిశీలించారు. రాయగిరి–యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణ పనులతోపాటు గండి చెరువు, రింగ్‌రోడ్డు, ప్రెసిడెన్షియల్‌ సూట్, ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న పచ్చదనాన్ని పరిశీలించి యాదాద్రి కొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయం పనులను పరిశీలించారు. దాదాపు రెండున్నర గంటలపాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగారు. ప్రతి నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. గర్భాలయం పనుల్లో వచ్చిన పగుళ్లను గుర్తించి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. గర్భాలయం తెరిచేటప్పుడు, మూసేటప్పుడు అడ్డుగా ఉన్న గుండును ఎందుకు సరి చేయలేకపోయారని నిలదీశారు. యాదాద్రి ప్రధాన ఆలయం, శిల్పి పనులు మినహా మిగతా పనులన్నింటినీ ఎందుకు పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. కావాల్సిన నిధులు విడుదల చేస్తానని, నెలరోజుల్లో పనులన్నింటినీ పూర్తిచేయాలని స్పష్టంచేశారు. వెంటనే రూ.54 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 15 రోజుల్లో రూ.470కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం చేస్తూ కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న ఆర్‌అండ్‌బీ ఈఈ వసంత నాయక్‌పై వేటు వేసి.. ఆయన స్థానంలో ఆర్‌అండ్‌బీ సీఈ మోహన్‌నాయక్‌ను డిప్యుటేషన్‌లో వైటీడీఏ విధుల్లో చేరాలని ఆదేశించారు.

డిసెంబర్‌లోగా పూర్తి చేయాలి... 
ప్రధాన ఆలయంతోపాటు మిగతా పనులన్నీ డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదే«శించారు. ప్రధాన ఆలయంలో ఎక్కడెక్కడ విద్యుత్‌ దీపాలు వస్తాయి, ఏసీలు ఎక్కడ వస్తాయి, కిటికీలు ఎక్కడ వస్తాయనే అంశాలపై అర్కెటెక్టు ఆనందసాయితో చర్చించారు. ప్రధాన ఆలయంలో లక్ష్మీదేవి ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసే విధంగా పనులు చేయాలని చెప్పారు. క్షేత్రపాలకుడి ఆలయాన్ని పరిశీలించి పలు మార్పులు సూచించారు. రిటైనింగ్‌ వాల్‌ పనులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ నిర్మిస్తున్న వర్షం నీటి కాల్వను తగ్గించాలని ఆదేశించారు. సప్త రాజగోపురాలు, అష్టభుజి మండపాలు, కల్యాణ మండపం, క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, ధ్వజస్తంభం, ఆళ్వారు స్వాముల విగ్రహాలు, గర్భగుడి ప్రాంతం, శయన మందిరం, అంతఃప్రాకారాలు, హుండీ లెక్కింపు ప్రాంతం, శ్రీస్వామివారి పుష్కరిణి, శివాలయం, తెప్పోత్సవం నిర్వహించే తదితర నిర్మాణాలను పరిశీలించారు. ప్రధానాలయ మాడ వీధుల నిర్మాణంలోనూ, గుడి అంతర్గత పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయంలో ఉన్న ఎతైన దిమ్మెను తొలగించాలని సూచించారు.  

యాగస్థల పరిశీలన... 
ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహా సుదర్శన నారసింహ యాగం స్థలిని సీఎం పరిశీలించారు. గండి చెరువు నుంచి యాదగిరిపల్లి వరకు ఉన్న 90 ఎకరాల స్థలాన్ని వాహనంలో తిరుగుతూ చూశారు. కొద్దిసేపు కాన్వాయ్‌ని నిలిపి అక్కడి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే జరుగుతున్న ప్రెసిడెన్సియల్‌ సూట్‌ల నిర్మాణం పనులను బస్సులో నుంచి పరిశీలించారు. రింగ్‌రోడ్డు, గిరిప్రదక్షిణ పనుల పురోగతిని తెలుసుకొని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠద్వారం వద్ద నూతనంగా నిర్మిస్తున్న గాలి గోపురం పనులు, మొదటి ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న పచ్చదనాన్ని పరిశీలించారు. 

శివాలయంలో రామాలయమా? 
శివాలయంలో రామాలయం నిర్మాణం ఏమిటని సీఎం అధికారులను ప్రశ్నించారు. గతంలో రామాలయం ఎక్కడ ఉందని అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తిని అడగగా.. ప్రధాన ఆలయం పక్కనే ఉండేదని ఆయన వివరించారు. దీంతో యథాస్థానంలో రామాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వాస్తు, ఆర్కిటెక్ట్‌లకు చీవాట్లు పెట్టారు. శివాలయానికి వెళ్లే దారిలో నిర్మిస్తున్న శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రసాద మండపాలకు మధ్యలో ఖాళీ స్థలంలో ఎగుడు, దిగుడు లేకుండా సమాంతరంగా స్లాబ్‌ వేయాలని, మెట్లు నిర్మించాలని ఆదేశించారు. సుమారు రెండున్నర గంటల పాటు కొండపైన జరుగుతున్న పనులన్నీంటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. పలుచోట్ల అవసరమైన సలహాలు, సూచనలు చేశారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు 
అంతకుముందు యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభం, ఆలయ సంప్రదాయంతో స్వాగతం పలికారు. బాల ఆలయంలోని ప్రతిష్ట మూర్తులకు సుమారు 10 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎం కేసీఆర్‌కు వేద ఆశీర్వచనం చేశారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు, యాదాద్రి జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ అనితా రాంచంద్ర¯న్, ఆలయ ఈవో గీత, ఆలయ శిల్పి ఆనంద్‌ సాయి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారుడు సుధాకర్‌ తేజ, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
ప్రత్యేక ప్రారంభోత్సవం ఉండదు 
యాదాద్రి ప్రధాన దేవాలయం పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులను రెండు మూడు నెలల్లో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రధాన దేవాలయం పనుల కోసం ఇప్పటి వరకు రూ.235 కోట్ల ఖర్చు చేశామని.. భూసేకరణ, రహదారుల నిర్మాణం, దేవస్థాన నిర్వహణ తదితర ఖర్చులన్నీ కలిపి రూ.692 కోట్ల వ్యయమైనట్లు వెల్లడించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొత్తగా నిర్మిస్తున్నది కాదు కాబట్టి, ప్రారంభోత్సవం ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత శాస్త్రోక్తంగా పూజలు, దర్శనాలు యథావిధిగా పాత పధ్దతిలోనే కొనసాగుతాయన్నారు. ఆలయ పనుల పరిశీలన తర్వాత కేసీఆర్‌ అధికారులతో దాదాపు 5 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రధాన ఆలయం పనుల్లో సింహభాగం పూర్తయింది. కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలాయి. వాటి పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. ఇకపై ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రతివారం యాదాద్రిలో పర్యటించి పనుల పురోగతిని నేరుగా పర్యవేక్షిస్తారు. ప్రధాన ఆలయం పనులతో పాటు రింగురోడ్డు నిర్మాణం, ప్రెసిడెన్షియల్‌ సూట్స్, కాటేజీలు, విద్యుత్‌ సబ్‌–స్టేషన్‌ తదితర పనులన్నీ రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలి. టెంపుల్‌ సిటీలో 250 కాటేజీలు నిర్మించాలి. ఇందుకోసం దాదాపు రూ.400 కోట్ల విరాళాలు ఇవ్వడానికి వివిధ కార్పొరేట్‌ సంస్థలు, దాతలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే కాటేజీల డిజైన్లు రూపొందించి నిర్మాణం ప్రారంభించాలి. భూసేకరణ త్వరగా పూర్తి చేసి ప్రధాన రహదారులన్నీ వెడల్పుగా నిర్మించాలి’’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రధాన ఆలయం ఉన్న గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి వీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈ చెరువును నింపడానికి అనువుగా కాలువ నిర్మించాలని పేర్కొన్నారు. ‘‘చెరువు కింది భాగంలో పురుషులు, మహిళలకు వేరువేరుగా కళ్యాణ కట్టలు, నీటి కొలనులు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. గుట్ట కింది భాగంలోనే బస్టాండు, ఆటో స్టాండు, పార్కింగ్, ఫైర్‌ స్టేషన్, పోలీస్‌ ఔట్‌ పోస్టు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయాలి. మైసూరు బృందావన్‌ గార్డెన్‌ లాగా తీర్చిదిద్దబోతున్న బస్వాపూర్‌ చెరువు ప్రాంతంలో అధునాతన హరిత రెస్టారెంట్, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలి. పునరుద్ధరణ పనులు పూర్తయిన తరువాత బస్సుల ద్వారా భక్తులను గుట్ట పైకి చేర్చాలి. ఇందుకోసం గుట్టపైన బస్‌ బే నిర్మించాలి’’అని కేసీఆర్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు