రైతు కుటుంబాలకు అండగా ఉంటాం

11 Aug, 2018 01:42 IST|Sakshi

రైతు బీమా సమీక్షలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు బీమా ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకమని, ఇది తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే భరోసా అని పేర్కొన్నారు.

ఆగస్టు 15 నుంచి మొదలుకానున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో శుక్రవారం సమీక్షించారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రైతు బీమా పథకంలో ఇంకా పేరు నమోదుకాని అర్హులైన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని... వారికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఎల్‌ఐసీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి పది రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెక్కు అందించాల్సిందేనని చెప్పారు. ఈ చెక్కును రైతు కుటుంబ సభ్యులకు చేరేలా యంత్రాంగాన్ని నియమించి పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

బీమా మొత్తం బాధ్యులకు చేరే క్రమంలో తలెత్తే ఇబ్బందులు, నిబంధనల సమస్యలను పరిష్కరించి అర్హులకు బీమా చెక్కులను అందించే బాధ్యత స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ కార్యదర్శులదేనని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ కార్యదర్శి సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాలధర్మం చేసిన అర్హుడైన/అర్హురాలైన రైతుకు 48 గంటల కాలపరిమితిలో మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందచేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శిదేనన్నారు.


అధికారులు చేపట్టాల్సిన చర్యలపై...
రైతుకు బీమా అందే క్రమంలో దశలవారిగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. రైతు మరణించిన వెంటనే సమాచారాన్ని ఎవరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది? ఆ సమాచారాన్ని ముందుగా ఎవరికి చేరవేయాలి? ఈ సమాచారం జీవిత బీమా సంస్థ అధికారులకు ఎలా తెలియజేయాలి? ప్రభుత్వం, బీమా సంస్థతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నియమ నిబంధనల్లో వ్యవసాయ విస్తరణ అధికారి పాత్ర, గ్రామ కార్యదర్శి పాత్ర, రైతు సమన్వయ సమితి సభ్యుల పాత్ర ఎలా ఉండాలో సూచించారు.

బాధలో ఉన్న రైతు కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి పది రోజుల్లోగా వారికి బీమా చెక్కు అందేందుకు తీసుకోవాల్సిన చర్యలను పంచాయితీరాజ్, వ్యవసాయ అధికారులకు వివరించారు. 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 636 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచే ఈ పథకం అమలులోకి రానుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో అర్హులైన రైతుల పేర్లను, ఇతర‡ వివరాలను వ్యవసాయ విస్తరణాధికారి నమోదు చేసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు