పల్లె ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే..

12 Apr, 2017 00:48 IST|Sakshi
పల్లె ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే..

కులవృత్తుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: కడియం
ప్రజలను కులవృత్తులకే పరిమితం చేయాలనుకుంటే గురుకులాలెందుకు తెరుస్తామని ప్రశ్న
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి
అవగాహన లేని విమర్శలను పట్టించుకోబోమని స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్‌: ‘కుల వృత్తులు, వ్యవసా య ఉత్పత్తులపైనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ అంశాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కులవృత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వీటిపై ఆధాపడి ఉన్న కుటుంబాలను బాగు చేసేందుకు ప్రత్యేక పథకాలు తీసుకొస్తున్నారు. వీటిని జీర్ణించుకోని కొందరు విమర్శలు చేస్తున్నారు. విమర్శలను మా ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల్ని ఎవరూ ఆపలేరు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే 191వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సరైన అవగాహన లేకుండా, లక్ష్యాన్ని అర్థం చేసుకోకుండా కొందరు నాయకులు మాట్లాడు తున్నారు. కుల వృత్తుల చేసుకునే వారు ఆ పనులకే పరిమితంకావాలా అని ప్రశ్నిస్తు న్నారు. కుల వృత్తులకే పరిమితం చేయాలని భావిస్తే మూడేళ్ల కాలంలో విద్యపై రూ.వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 500లకు పైగా గురుకుల పాఠశాలలను ఎందుకు ప్రారంభిస్తాం’ అని ప్రశ్నించారు.

బడుగు వర్గాలకు పవిత్ర మాసం..
ఏప్రిల్‌ నెల బడుగు బలహీన వర్గాలకు పవిత్ర మాసమని, జగ్జీవన్‌రామ్, జ్యోతిబాఫూలే, అంబేడ్కర్‌ వంటి మహానుభావులు జన్మించడంతో అన్ని వర్గాలు నెలంతా పండగ చేసుకుంటాయని కడియం చెప్పారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనేదే ఫూలే ఆశయమని, ఆయన ఆశయాలను అంబేడ్కర్‌ కొనసాగించారని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుతో అన్ని వర్గాలకు లబ్ధి కలుగుతోందని చెప్పారు.

 హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు యువకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు గతంలో ఎన్నడూ లేనంతగా రూ.ఐదున్నర వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ గణేశాచారి, బీసీ సంఘం నాయకులు కాలప్ప, జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫూలే ఆదర్శాల అమలు కోసం..
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఫూలే ఆదర్శాలను కేసీఆర్‌ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారని కడియం తెలిపారు. అందులో భాగంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు విదేశీ విద్యా నిధి పథకాన్ని అమలు చేస్తున్నారని, ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలు  చేయని పనులు కేసీఆర్‌ హయాంలో జరిగాయని, వసతి గృహాలు, హాస్టళ్లలో విద్యార్థులకు మెస్‌ చార్జీలు భారీగా పెంచామని, యూనివర్సిటీల్లో మెస్‌ బకాయిలు పూర్తిగా మాఫీ చేశామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు