డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

23 Jul, 2020 01:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: భారత్‌– చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఆమెకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో  నియామక ఉత్తర్వులను అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను కోరారు.

సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ప్రశాంతరెడ్డి, నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దీపికా యుగంధర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి స్థలం అప్పగింత
షేక్‌పేట మండల పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 14లో కేబీఆర్‌ పార్కు ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి బుధవారం కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అప్పగించారు. ఆర్డీఓ, తహసీల్దార్లతో సమక్షంలో స్థల పంచనామా నిర్వహించి స్థలాన్ని స్వాధీనం చేశారు. కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం షేక్‌పేట మండలంలో మూడు స్థలాలను కుటుంబసభ్యులకు చూపించారు. వీటిలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో స్థలం కావాలని వారు కోరగా, ఈ స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్‌ తమకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కల్నల్‌ సతీమణి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు