రైతన్నలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు!

21 Apr, 2017 12:33 IST|Sakshi
రైతన్నలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు!

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ రైతన్నలపై వరాల జల్లు కురిపించారు. సమాజంలో రైతులంటే చులకనభావం ఉందని, తెలంగాణలో ఆ భావాన్ని తొలగించాలని ఆయన అన్నారు. తెలంగాణలో రైతే రాజు అవుతాడని, ధనిక రైతులుండే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కొంపల్లిలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. అణగారిన రైతన్నల జీవితాలను బాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్టుబడి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడి అందిస్తామని, ఆ పెట్టుబడితో రైతు యూరియా కొనుక్కోవచ్చు లేదా ఏదైనా కొనుకోవచ్చు అని చెప్పారు. సాధారణ వ్యవసాయ పంటలకే కాక, పండ్ల తోటలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఒక పంటకు కాదు రెండు పంటలకు ఈ పెట్టుబడి అందిస్తామని, ప్రతి మే నెలలో ఒకసారి, అక్టోబర్‌ నెలలో మరోసారి నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు అందజేస్తామని చెప్పారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకంలోకి దళారులను రానివ్వొద్దని ఆయన కోరారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు ప్రతి ఊరిలోనూ గ్రామరైతు సంఘాలను ఏర్పాటుచేస్తామని, ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణను పంటలకాలనీగా విభజించి.. ఆయా జిల్లాలలోని వాతావరణం, వర్షపాతం ఆధారంగా పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే వ్యవసాయశాఖలో ఐదువేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ సీజన్‌లో కూలీ సమస్య తలెత్తుతున్నదని, కాబట్టి ఈ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్లీనరీ వేదికగా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు