కరోనా లక్షణాలున్న అందరికీ పరీక్షలు

6 Apr, 2020 02:51 IST|Sakshi

ఉన్నతస్థాయి సమీక్షలో కేసీఆర్‌ స్పష్టీకరణ

కరోనా సోకినవారు కలసిన ప్రతి ఒక్కరూ క్వారంటైన్‌కు

వైద్య, ఆరోగ్య సిబ్బందికి అండగా ఉంటాం

వైద్యుల రక్షణ పరికరాల కొనుగోళ్లకు సీఎంఆర్‌ఎఫ్‌ విరాళాలు

టెస్ట్‌ కిట్స్, పీపీఈలు, మాస్కులు సరిపడా ఉన్నాయి

వరి కోతలు, ధాన్యం సేకరణకు ఇబ్బందులు రావొద్దు

పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామని, వ్యాధి సోకినవారు కలసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్‌ చేస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తోంది. (కరోనా: ఆ జిల్లాలు జాగ్రత్త!)

వారి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడా టెస్ట్‌ కిట్స్, పీపీఈలు, మాస్కులు, మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పీపీఈలు సేకరిస్తాం’అని సీఎం ప్రకటించారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పీపీఈలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని సూచించారు. 

రైతులకు ఇబ్బంది రావద్దు..
లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘లాక్‌డౌన్‌ కారణంగా జనజీవనం స్తంభించింది. అయినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దని, వారు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్కెట్లలో రద్దీని నివారించడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరి కోతలు, ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరగాలి. వరికోతలకు రైతులు హార్వెస్టర్లు ఉపయోగించే పరిస్థితిని గ్రామాల్లో కల్పించాలి. హార్వెస్ట్‌ పరికరాలను బిగించే మెకానిక్‌లకు ప్రత్యేక పాసులిచ్చి అనుమతించాలి.

స్పేర్‌ పార్ట్స్‌ అమ్మే షాపులను తెరవడానికి అనుమతి ఇవ్వాలి. గ్రామస్తులు తమ గ్రామాల్లోకి హార్వెస్టర్లను రానివ్వాలి. ఆ తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వాహనాలకు అనుమతివ్వాలి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఒకేసారి రాకుండా చూడాలి. వారికిచ్చిన కూపన్లలో పేర్కొన్న తేదీ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా రైతులను చైతన్యపరచాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. రైతుల దగ్గరి నుంచి చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులెవరూ తొందరపడొద్దు’అని సీఎం కోరారు.

గన్నీ బ్యాగుల కోసం ప్రధానికి ఫోన్‌
రాష్ట్రంలో గన్నీ బ్యాగులకు తీవ్ర కొరత ఉంది. గన్నీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. ఏటా అక్కడి నుంచే బ్యాగులు వస్తాయి. ఈసారి లాక్‌డౌన్‌ కారణంగా బెంగాల్‌లో పరిశ్రమలు మూతపడటంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగుల తయారీ పరిశ్రమలను తెరిపించాలని, గన్నీ బ్యాగులు రాష్ట్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రాష్ట్రానికి గన్నీ బ్యాగులు చేర్చే విషయంలో సంబంధిత శాఖలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  (ఒకే ఇంట్లో భర్త నుంచి భార్యకు పిల్లలకు..)

మరిన్ని వార్తలు