లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం?

27 May, 2020 02:19 IST|Sakshi

కీలక అంశాలపై నేడు ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష

కరోనా వ్యాప్తి, ఆంక్షల ఎత్తివేత, రాత్రిపూట కర్ఫ్యూపై చర్చ

రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ తీరుపై దిశానిర్దేశం

ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపుపైనా నిర్ణయం!

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై స్పష్టతనిచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31న ముగియనుంది. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా జూన్‌ 1 నుంచి మరిన్ని ఆంక్షలు సడలించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చనున్నారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు, వానాకాలంలో నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపు వంటి పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు, ఆయా అంశాలకు సంబంధించి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అధికార యంత్రాంగానికి ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేసే అవకాశముంది.

ఈ నెల 18న జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు.. లాక్‌డౌన్‌ నిబంధనలను భారీగా సడలించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరి ధిలో మినహా మిగతా అన్నిచోట్లా సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తు తం సరి–బేసి విధానంలో దుకాణా లను తెరుస్తున్నారు. ఈ పద్ధతిని మరి కొంతకాలం కొనసాగించాలా లేక, పూర్తిస్థాయిలో అనుమతివ్వాలా అనే అంశంపైనా బుధవారం నాటి సమావేశంలో చర్చించే అవకాశముంది. ప్రస్తుతం భౌతికదూరం నిబంధనలతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుసర్వీసులు, ప్రత్యేక రైళ్లు, దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీతో పాటు అన్నిచోట్లా వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం గతంలోనే అనుమతించింది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని ఆంక్షలతో ఆర్టీసీ బస్సులు నడపాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ సరి–బేసి విధానాన్ని ఎత్తివేసినా ప్రార్థన మందిరాలు, సమావేశాలు, ఉత్సవాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు తదితరాలపై ఆంక్షలు కొనసాగించే అవకాశముంది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆంక్షల విషయమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రమంతటా అమలవుతున్న రాత్రి పూట కర్ఫ్యూను మాత్రం మరికొంత కాలం కొనసాగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అవతరణ వేడుకలు..ఉద్యోగుల వేతనాలపై..
జూన్‌ 2న జరగాల్సిన రాష్ట్ర అవరతణ వేడుకలను నిర్వహించాల్సిన తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. జూన్‌ మొదటి వారంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలా వద్దా, పాఠశాలలు ఎప్పటి నుంచి తెరవాలి, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ తదితరాలపై సమీక్షలో చర్చించి స్పష్టతనిచ్చే అవకాశముంది. కరోనా మూలంగా మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి ప్రభుత్వోద్యోగులకు సగం వేతనాలే చెల్లించారు. అయితే మే నెలకు సంబంధించి మాత్రం పూర్తి వేతనం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆంక్షల సడలింపుతో ఖజానాకు వస్తున్న రాబడి తదితరాలను మరోమారు సమీక్షించి దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వానాకాలంలో నియంత్రిత విధానంలో సాగు చేయాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయించగా, రైతులకు అవగాహన కల్పించేందుకు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ఎరువులు, విత్తనాల లభ్యత వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్షించి అవసరమైన ఆదేశాలు జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు