‘ప్రగతి నివేదన’ ఏర్పాట్ల పరిశీలన

25 Aug, 2018 00:58 IST|Sakshi
శుక్రవారం కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేసీఆర్‌.  చిత్రంలో కేకే, కేటీఆర్, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభాస్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో సెప్టెంబర్‌ 2న 25 లక్షల మంది నడుమ ఎన్నికల భేరీ మోగించాలని భావిస్తున్న సీఎం.. సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, నరేందర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, కలెక్టర్‌ రఘునందర్‌రావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌చంద్, పోలీస్‌ కమిషనర్లు సజ్జన్నా ర్, మహేశ్‌ భగవత్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులతో కలిసి ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

ప్రధాన వేదిక, మీడియా గ్యాలరీ, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, పార్కింగ్‌ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరు కానున్నందున పార్కింగ్‌కు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఆయా ప్రాంతాల వారు సభాస్థలికి వచ్చి పోయే మార్గాలను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించాలని ఆదేశించారు. 

20 మార్గాలు అభివృద్ధి చేయండి 
దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించే ఈ బహిరంగ సభకు చేరుకునేందుకు నలువైపులా కనీసం 20 రోడ్లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. కేవలం తొమ్మిది మార్గాలనే ప్రతిపాదించడం వల్ల ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతుందని, సభాస్థలికి చేరుకోవడం కష్టంగా మారుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, బెంగళూరు హైవేలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి వచ్చే లింక్‌రోడ్లను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు.

సభా ప్రాంగణంలోకి రాకపోకలు సాగించేలా కనీసం 30 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రవేశ ద్వారాల సంఖ్య పెంచాలని సూచించారు. వీఐపీలు రావడానికి ప్రత్యేక మార్గం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 7 వేల ఆర్టీసీ బస్సులు, 20 వేల విద్యాసంస్థల బస్సులు, ఐదు వేల ప్రైవేటు వాహనాల్లో జనాలు సభకు రానున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎంకు వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వాహనాలను సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతి పైసా పార్టీదే..
ప్రగతి నివేదన సభకయ్యే ప్రతి పైసాను పార్టీ భరిస్తుందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ అన్నారు. 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న సభ కావడం.. భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశమున్నందున రైతుల పంటలకు నష్టం వాటిల్లితే చెల్లించాలని సూచించారు. పార్కింగ్, ఇతరత్రా అవసరాలకు సమీపంలోని వెంచర్లు, ప్రైవేటు భూములను వినియోగించుకోవాలన్నారు. బహిరంగ సభ విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని, అందుకనుగుణంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు