పుస్తకంగా తీసుకురావడం హర్షణీయం

6 Dec, 2019 03:34 IST|Sakshi

‘కాళేశ్వరం ప్రాజెక్టు–తెలంగాణ ప్రగతిరథం’

పుస్తకావిష్కరణలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ల రికార్డు సమయంలోనే రైతాంగానికి నీటిని సరఫరా చేసే దశకు చేరుకున్న నిర్మాణ ఘట్టాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి పుస్తకరూపంగా తీసుకురావటం హర్షణీయమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌ లో సీఎం ఓఎస్డీ (నీటిపారుదల శాఖ) శ్రీధర్‌రావు దేశ్‌పాండే రాసిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు–తెలంగాణ ప్రగతిరథం’పుస్తకాన్ని గురువారం సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

సీఎం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే ఈ గ్రంథాన్ని రాశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి సీఎం కేసీఆర్‌ దీక్షతో చేసిన కృషిని, ఒక ఇంజనీర్‌ కంటే ఎక్కువగా, గూగుల్‌ ఎర్త్‌ సాఫ్ట్‌వేర్‌ని, కేంద్ర జలసంఘం గోదా వరి ప్రవాహ లెక్కలను ఉపయోగించి చేసిన పరిశోధనలన్నింటినీ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రచయిత దేశ్‌పాండేను సీఎం అభినందించారు.

రోడ్ల మరమ్మతులకు మరో 177 కోట్లు ఇవ్వండి 
రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలకు జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు అదనంగా రూ.177 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి గురువారం లేఖ రాశారు.

సెల్ఫీని బహుమతిగా పంపండి: ఎంపీ సంతోష్‌
సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పేరుతో రాష్ట్రం మొదలుకొని జాతీయస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 7వ తేదీన తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటుతూ దిగిన సెల్ఫీలను ఆయనకు బహుమతిగా పంపాలని సంతోష్‌కుమార్‌ కోరారు. నేల పచ్చగా ఉంటే మనుషులంతా చల్లగా ఉంటారనే సీఎం కేసీఆర్‌ మాటలతో తాను స్ఫూర్తి పొందానన్నారు. ‘మీరు నాటిన మొక్కలతో సెల్ఫీలు దిగి నా ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సప్‌ ఖాతాలు నిండిపోయేలా చేస్తారని ఆశిస్తున్నట్లు’వివరించారు.

మరిన్ని వార్తలు