ప్లాస్టిక్‌ పనిపడదాం

11 Oct, 2019 01:42 IST|Sakshi
కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి, విక్రయాలపై నిషేధం

త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో ఉత్తర్వులు!

నిషేధం విధివిధానాల తయారీకి ఆదేశం

కలెక్టర్లకు రూ. 2 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు

ఇకపై ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి

ఇళ్లను శుభ్రంగా ఉంచుకుంటే ఉత్తమ గృహం అవార్డు

20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ 

పల్లె ప్రగతిపై మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘ సమావేశం

కార్యక్రమం దిగ్విజయంగా అమలైందని కితాబు  

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ ఉత్పత్తి, విక్రయాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం–పరిశుభ్రత పెంపు లక్ష్యంగా నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) అమలు జరిగిన తీరుపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ భేటీ రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ భేటీలో ప్లాస్టిక్‌పై నిషేధం, గ్రామ పంచాయతీల సిబ్బందికి రూ. 2 లక్షల జీవిత బీమా, ఏటా మూడుసార్లు పల్లె ప్రగతి, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహణ, ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పీసీసీఎఫ్‌ శోభ, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రతి జిల్లా కలెక్టర్‌ 30 రోజుల కార్యక్రమం అమలులో వారి అనుభవాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమష్టి ప్రణాళిక, కార్యాచరణ, అభివృద్ధి ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.

పల్లె ప్రగతి దిగ్విజయం... 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దిగ్విజయమైందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అన్ని గ్రామాల్లో పవర్‌ వీక్‌ నిర్వహించి విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్‌శాఖ అద్భుతంగా పనిచేసి అన్ని శాఖల్లోకెల్లా నంబర్‌ వన్‌గా నిలిచిందని కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన... 
పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఎట్టిపరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమన్నారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ. 339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమన్నారు. మొక్కలను పెంపకం, చెత్త ఎత్తేవేసే పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వాడుకోవాలని సీఎం సూచించారు.

విద్యుత్‌ సిబ్బంది పనితీరు భేష్‌... 
విద్యుత్‌ సిబ్బంది 30 రోజుల కార్యాచరణ ముగిసినప్పటికీ ఇంకా గ్రామాల్లో పనులు చేస్తున్నారని (గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణకు 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారు.    వీధిలైట్లకు బిగించిన 7,527 కరెంటు మీటర్లు పాడైపోయినందున వాటి స్థానంలో కొత్త మీటర్లు మిగిస్తున్నారు. వీధిలైట్ల కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారు) సీఎం కేసీఆర్‌ అభినందించారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా గ్రామాల్లో విద్యుత్‌ సంబంధ సమస్యల పరిష్కారానికి ఇప్పటిదాకా ఇంత పెద్ద ప్రయత్నం జరగలేదన్నారు. నిర్దేశించిన పనుల్లో ఇప్పటికే 60 శాతానికిపైగా పూర్తయ్యాయన్నారు. ఏజన్సీ ప్రాంతాలు, ఎస్టీ తండాలు, గూడేల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడానికి సీనియర్‌ ఐఏఎస్‌లు సోమేశ్‌కుమార్, రఘునందన్‌రావు, అజయ్‌ మిశ్రాలతో కమిటీ వేశారు.

ఒక్కో కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధి... 
గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, భూపాలపల్లి కలెక్టర్‌ వెంకటేశ్వర్లును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నామన్నారు. ఈ నిధులను కలెక్టర్లు వారి విచక్షణ మేరకు వినియోగించాలని సూచించారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు రూ. 64 కోట్ల నిధులు విధుల చేస్తూ రాష్ట్ర ప్రణాళికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అడవులు తక్కువ ఉన్న చోట ప్రత్యేక శ్రద్ధ... 
హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. అడవులు తక్కువగా ఉన్న కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్, గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మూడుసార్లు పల్లెప్రగతి.. 20 రోజులు పట్టణ ప్రగతి 
ఇకపై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతీ ఏటా మూడు సార్లు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఏటా జూన్, సెప్టెంబర్, జనవరిలలో 10 రోజుల చొప్పున పల్లె ప్రగతి నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, దీనికోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పల్లెల్లో బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై పరిశీలన.. 
పచ్చదనం–పరిశుభ్రత పెంచే కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకొనే వారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాల్లో బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్, ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ అమలు సాధ్యాసాధ్యాలను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలోని కమిటీ పరిశీలించాలన్నారు. కమిటీ నివేదిక ఇచ్చాక బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి గ్రామం సరిహద్దులను నిర్ణయిస్తూ, గ్రామ కంఠాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని రహదారులను గ్రామ పంచాయతీ పేర రిజిష్టర్‌ చేయాన్నారు.

రైతు బీమా తరహాలోనే పంచాయతీ సిబ్బందికి బీమా
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఖర్చుతో ఎస్‌కే డే జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా చూస్తామని తెలిపారు. రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బీమా మాదిరిగానే ఎస్‌కేడే బీమా ఉంటుందని చెప్పారు. పంచాయతీరాజ్‌ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్‌కేడేకు నివాళిగా జీవిత బీమాకు ఆయన పేరు పెడుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో నరేగా నిధులతో సోక్‌ పిట్స్‌ నిర్మించాలని ఆదేశించారు. సోక్‌ పిట్స్‌ వల్ల ఏ ఇంటిలోని వ్యర్థం, మురికినీరు అక్కడే అంతర్థానమవుతుందని చెపారు. సోక్‌పిట్స్‌ నిర్మాణంలో సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి చెప్పిన మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...  

 • ఈ ఏడాది 75 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. పౌర సరఫరాలశాఖ ద్వారా ధాన్యాన్ని సేకరించాలి. ఇందుకోసం అవసరమైనన్ని సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాడానికి కలెక్టర్లకు పూర్తి అధికారం ఉంది. అందరూ ఒకేసారి సరుకును మార్కెట్‌కు తేకుండా నియంత్రిత పద్ధతిలో సేకరణ జరగాలి. 
 • గ్రామ కంఠంలోని ఆస్తులు, స్థలాలు, ఇళ్లు ఏదో ఒక పద్ధతి ప్రకారం రికార్డు కావాలి. ఏదో ఒక రకమైన టైటిల్‌ ఆస్తి సొంతదారులకు ఉండాలి. దీనికి ఏం చేయాల్నో ఆలోచన జరగాలి. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలి. పంచాయతీరాజ్‌ కార్యదర్శి ఈ అధ్యయనం చేయాలి. మనం తీసుకున్న నిర్ణయం దేశానికే ఒక మోడల్‌ కావాలి. 
 • గ్రామాల్లో లే ఔట్‌ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాన్ని గురించి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అధ్యక్షతన నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయాలి. 
 • రాష్ట్రంలోని మొత్తం లంబాడీ తండాల్లో అటవీ భూముల్లో ఎన్ని, అటవీయేతర భూముల్లో ఎన్ని ఉన్నాయో గుర్తించాలి. ఉన్న తండాలు, గోండు గూడేలు, కోయ గూడేలు, సొంత జాగాల్లో ఎన్ని ఉన్నాయో కలెక్టర్లు లెక్కలు తీయాలి. 
 • గ్రామ పంచాయతీలో నిర్ణయాలు, నిధుల వినియోగం ఏకస్వామ్యంగా ఉండకూడదు. గ్రామపంచాయతీలో సమిష్టిగా నిర్ణయాలు జరగాలి. 
 • గ్రామాల్లో ఏర్పాటు చేసే డంప్‌ యార్డుల పై షెడ్లు ఏర్పాటు చేయాలి. షెడ్లు లేకుంటే వర్షపు నీరు చేరి, కాలుష్యం వ్యాప్తిచెందే ప్రమాదముంది. 
 • గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాలకు ఇచ్చినట్లే మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పట్టణాలకూ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం. 
 • పట్టణ పరిపాలనను మరింత పటిష్ట పరిచేవిధంగా సెంటర్‌ ఆఫ్‌ అర్బన్‌ ఎక్స్‌ లెన్సీ ప్రారంభించాలి. 
 •  గ్రామాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనకు, అమలుకు, పర్యవేక్షణ, శిక్షణ కోసం తెలంగాణ స్టేట్‌ అకాడమీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ను బలోపేతం చేయాలి.  
 • గ్రామాలు, పట్టణాల్లో స్మృతి వనాలు ఏర్పాటు చేయాలి. ఎవరైనా పుడితే వారి పేరుమీద మొక్కను నాటాలి. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకం కోసం చెట్టు పెట్టాలి. 
 • గ్రామాల్లో వీధిలైట్ల కోసం మీటర్ల బిగింపు వందశాతం పూర్తయిన వెంటనే, మీటరు రీడింగుకు అనుగుణంగా ప్రతినెలా విద్యుత్‌ బిల్లులను విధిగా చెల్లించాలి. 
 • మంకీ ఫుడ్‌ కోర్టుల కోసం అవసరమైన పండ్ల మొక్కలను అటవీశాఖ సరఫరా చేయాలి. అటవీ భూములు ఎక్కువగా లేనిచోట నదులు, ఉప నదులు, కాలువలు, వాగులు, చెరువుల ఒడ్డున కోతులు తినడానికి ఉపయోగపడే పండ్ల చెట్లు పెంచాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా