గోదావరితో జలహారం

19 Jan, 2020 01:50 IST|Sakshi

గరిష్ట వినియోగంతో రాష్ట్రమంతా  నీటి సరఫరాకు బృహత్‌ ప్రణాళిక

కొండపోచమ్మ నుంచి కేశవాపూర్‌ ద్వారా హైదరాబాద్‌కు తాగునీరు

బస్వాపూర్‌ నుంచి డిండి, అటునుంచి పాలమూరు– రంగారెడ్డి ఆయకట్టుకు..

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ నింపేందుకు ప్రతిపాదనలు

కొత్తగా సీతారామ నుంచి ఏడు లిఫ్టులతో పాలేరు ఎగువ, దిగువన సాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలు

24న ఇంజనీర్లతో సీఎం కీలక సమావేశం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదీ జలాలతో ఉత్తర, దక్షిణ ప్రాంతాలన్నింటికీ జలాభిషేకం చేసే ప్రణాళిక శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సముద్రంపాలయ్యే నీటిని ఒడిసిపట్టి రాష్ట్రంలోని ప్రతి మూలకు పారించే దిశగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు నీటి లభ్యతను పెంచుతూనే నీరందని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలన్నింటినీ గోదావరితో తడిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎగువ నుంచి వచ్చే జలాలపైనే పూర్తిగా ఆధారపడ్డ కృష్ణా బేసిన్‌ ప్రాంతాలకు తాగు, సాగునీటిని ఏడాదంతా లభ్యతగా ఉంచేలా ప్రణాళికలు వేస్తోంది. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరుగా ఉంది. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్‌ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉండగా మరో 520 టీఎంసీల వినియోగానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. అయినప్పటికీ ఏటా వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.

అదే సమయంలో కృష్ణా బేసిన్‌ నీటి కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి జలాలతో నీటి కొరత తీవ్రంగా ఉన్న కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీటిని తరలిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇప్పటికే పూర్తి చేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గరిష్టంగా 400–500 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చి ఆ నీటిని కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డి, డిండి, నాగార్జునసాగర్‌లతో అనుసంధానించడం ద్వారా కరువు ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో కాళేశ్వరంతోపాటు సీతారామ ఎత్తిపోతల ద్వారా మొత్తంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తరలించేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రణాళికలపై ఇంజనీర్లతో ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.  

బస్వాపూర్‌ కేంద్రంగా పాలమూరు, డిండి, సాగర్‌లకు.. 
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న గోదావరి నీటిని పాలమూరు–రంగారెడ్డి, డిండి, నాగార్జునసాగర్‌తో అనుసంధానించే ప్రాథమిక ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కాళేశ్వరంలో 11.39 టీఎంసీల సామర్థ్యం గల బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని ఈ మూడు ప్రాజెక్టుల కింది ఆయకట్టు అవసరాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. బస్వాపూర్‌ నుంచి పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా తొలి ప్రతిపాదన ఉంది. బస్వాపూర్‌ నుంచి హై లెవల్‌ కెనాల్‌ ద్వారా 45 కి.మీ. దూరంలోని చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు.. అటు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు మీదుగా ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. నీటిని 210 కి.మీ. మేర తరలించేందుకు సుమారు 280 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించాల్సి వస్తుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు ఇప్పటికే అంచనా వేశారు. బస్వాపూర్‌ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కులను 120 రోజులపాటు తరలించగలిగినా 21 టీఎంసీలను ఉద్దండాపూర్‌కు తరలించే అవకాశం ఉంటుందని, దీనికి రూ. 5 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు.

ఇదే బస్వాపూర్‌ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించవచ్చని తేల్చారు. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని చెబుతున్నారు. ఇక అక్కడి నుంచే నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటిని తరలించేలా ఇటీవలే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది. బస్వాపూర్‌ నుంచి కేవలం 3 కి.మీ. కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్‌పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్‌నహర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్‌ చేసి పానగల్‌ వాగులో కలపాలని ప్రాథమికంగా తేల్చారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జునసాగర్‌లో ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తే అక్కడి నుంచి సాగర్‌ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50 లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు. 

నేరుగా కేపీ లక్ష్మిదేవునిపల్లికి మరో ప్రతిపాదన.. 
ఇక మరో ప్రతిపాదన ద్వారా కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కాల్వ నుంచి పాలమూరు–రంగారెడ్డిలో భాగమైన కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించే ప్రణాళిక వేశారు. దీనికోసం ప్రస్తుతం 2.8 టీఎంసీలుగల కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. 

కొండపోచమ్మ టు కేశవాపూర్‌.. 
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మసాగర్‌ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చేలా కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు ఇప్పటికే అనుమతుచ్చారు. కొండపోచమ్మసాగర్‌ మీదుగా కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు మూడు వరుసల గ్రావిటీ పైపులైన్ల ద్వారా నీటిని తరలించేలా పనులు త్వరలో చేపట్టనున్నారు. రిజర్వాయర్‌ నుంచి వచ్చే రా వాటర్‌ను ఘణపూర్‌లోని నీటి శుధ్ది కేంద్రంలో శుద్ధి చేసి శామీర్‌పేట్‌ ,సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్‌ మెయిన్‌ పైప్‌లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే కేశవాపూర్‌ను మొదట 10 టీఎంసీలతో ప్రతిపాదించగా ప్రస్తుతం 5.04 టీఎంసీలకు కుదిస్తున్నారు. దీనికి మొత్తంగా రూ. 3,363 కోట్లు అవుతుందని ప్రభుత్వం లెక్కగట్టింది. 

ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి.. 
హైదరాబాద్‌ తాగునీటికి ఎలాంటి కొరత ఏర్పడకుండా చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌కు, అటు నుంచి హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రతిపాదించారు. కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ ద్వారా ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ఈ ప్రణాళిక ఉంది. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్‌ వద్ద స్లూయిస్‌ నిర్మించి ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉన్న ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ. 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఉస్మాన్‌సాగర్‌ నిండితే హిమాయత్‌సాగర్‌కు నీటి తరలింపు సులభమే. 

సీతారామతో ‘సాగర్‌’కు భరోసా.. 
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింది ఆయకట్టు పూర్తిగా ఎగువ కర్ణాటక నుంచి వచ్చే వరదపైనే ఆధారపడి ఉంటోంది. అయితే ప్రతి పదేళ్లలో ఆరేళ్లు అంచనాలకన్నా తక్కువే నీరస్తోంది. వరద వచ్చిన సమయాల్లోనూ ఖరీఫ్‌ ఆయకట్టుకు నీరు అందించడం గగనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో సాగర్‌ కింది 6.50 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగానే ఇప్పటికే చేపట్టిన 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనులను సాగర్‌ కింది పాలేరు రిజర్వాయర్‌ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేయడం ద్వారా పాలేరు దిగువన ఉండే 2.50 లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

ఇక పాలేరు రిజర్వాయర్‌ ఎగువన ఉన్న ఆయకట్టు అవసరాల కోసం మరో కొత్త ప్రతిపాదన చేశారు. పాలేరు చేరే సీతారామ ఎత్తిపోతల నీటిని రివర్స్‌ పద్ధతిన సాగర్‌లో భాగమైన పెద్దదేవునిపల్లి రిజర్వాయర్‌కు తరలించాలని, ఇందుకోసం మరో 3 లిఫ్టులు ఏర్పాటు చేయాలని గుర్తించారు. దీనిద్వారా సాగర్‌ కింది 2.50 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. మరో ప్రతిపాదన ద్వారా సీతారామలోని ప్రధాన కాల్వను ప్రత్యేక చానల్‌ తవ్వకం ద్వారా సాగర్‌ కాల్వలకు అనుసంధానిస్తే మరో 70 వేల ఎకరాలకు నీరందుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే సమగ్ర సర్వే జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

దేవాదులకు కాళేశ్వరం జలాలు.. 
దేవాదులతో 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉండగా నీటిని తీసుకునే గంగాపురంలోని ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచి 187 కిలోమీటర్ల దూరంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌ వరకు నీటిని తరలించాల్సి ఉంది. దీనికింద 92 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉన్నా అది సాధ్యపడకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో 50 టీఎంసీల సామర్థ్యంగల మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 10 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్‌ లేదా ప్రెషర్‌ మెయిన్‌ నిర్మించి కనీసం 10 టీఎంసీలను తపాస్‌పల్లికి అందించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతుతున్నాయి. అయితే గ్రావిటీ కెనాల్‌ ప్రతిపాదన అమలుకు రూ. 100 కోట్లు ఖర్చు చేసినా మల్లన్నసాగర్‌లో కనీసం 30 టీఎంసీల నీటి లభ్యత ఉండాల్సి ఉంటుంది. అదే ప్రెషర్‌ మెయిన్‌ అయితే మల్లన్నసాగర్‌లో 12 టీఎంసీలున్నా నీటిని తరలించొచ్చు. కానీ దీనికి రూ. 400 కోట్ల వరకు ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు