సెప్టెంబర్‌ 2న అభ్యర్థుల ప్రకటన: కేసీఆర్‌

14 Aug, 2018 12:27 IST|Sakshi

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు ముందస్తు, మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపుతోంది. సోమవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేసీఆర్‌ మీడియా సమావేశంలో చేసిన కీలక ప్రకటనలు పార్టీలో ఎన్నికల వాతావరణానికి తెర తీశాయి. ఇదే సమయంలో సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివారు ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ‘ప్రగతి నివేదిన సభ’ పేరిట భారీ బహిరంగసభ.. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తా
మని పేర్కొనడం పార్టీలో హీట్‌ను పెంచింది. అభ్యర్థుల ప్రకటనకు సర్వేలే ప్రాతిపదకని చెప్పిన కేసీఆర్‌.. సెప్టెంబర్‌ 2న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కీలక ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. టికెట్‌ ఆశిస్తున్న వారిలో ‘ఏం జరుగుతుంది’ అన్న ఆందోళన మొదలైంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత ప్రకటన మేరకు అభ్యర్థుల ప్రకటనలో తాను స్వయంగా చేయించిన సర్వేలే కీలకం కానున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్‌ కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. చాలా వరకు సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని పలుమార్లు చెప్తున్న ఆయన.. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంతేగాకుండా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గతంలో కేసీఆర్‌ నియోజకవర్గం, జిల్లా బాధ్యులను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్‌ను జిల్లా ఇన్‌చార్జి జనరల్‌ సెక్రెటరీగా నియమించారు.

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి జనరల్‌ సెక్రెటరీగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 నియోజకవర్గాలకు నలుగురు బాధ్యులను నియమించారు. మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. సెప్టెంబర్‌ 2న ప్రకటించే అభ్యర్థుల జాబితాలో సర్వేలతోపాటు ఈ కమిటీలు, కొత్తగా వేసే మూడు నియోజకవర్గాలకో ‘స్క్రీనింగ్‌’ కమిటీలు కూడా కీలకం కానున్నాయని చెప్తున్నారు.

ఒంటరిపోరుకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌.. నేతల్లో మొదలైన టిక్కెట్ల టెన్షన్‌..
సోమవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్‌ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో సెప్టెంబర్‌ 2న భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహణ, అభ్యర్థుల ప్రకటనపై కూడా స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ‘ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవు. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయం’ అంటూ కుండబద్దలు కొట్టారు. సెప్టెంబరులోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్‌ కమిటీలు  ఏర్పాటు చేస్తామని కూడా సీఎం తెలిపారు. నాలుగేళ్లలో ఐదారు సర్వేలు నిర్వహించిన ఆయన చాలా మంది పనితీరును మార్చుకోవాలని పలువురు ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు, గ్రేడింగ్‌ కూడా ఇచ్చారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చాలావరకు అవకాశం ఇస్తామన్న ఆయన సర్వేలను కూడా ప్రామాణికంగానే తీసుకుంటామని కూడా పలుమార్లు పార్టీ కీలక భేటీల్లో వెల్లడించారు. ఇదే సమయంలో సోమవారం సెప్టెంబర్‌లో అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని కీలక ప్రకటన చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో టిక్కెట్ల టెన్షన్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు ఎంతమందికి మళ్లీ టిక్కెట్లు దక్కుతాయి? కొత్తగా ఎంతమంది చాన్స్‌ దొరుకుతుంది? ఒకవేళ పాతవారిని మార్చాల్సి వచ్చినా, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా వారిని అధినేత ఏ విధంగా సంతృప్తి పరుస్తారు? అన్న పలు కోణాల్లో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు