నేనే వాదిస్తా!

7 May, 2015 00:55 IST|Sakshi
నేనే వాదిస్తా!

కృష్ణా జలాల పంపిణీపై అధికారులతో సీఎం కేసీఆర్
నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేయించండి
శ్రీశెలం, సాగర్‌లలో పూడికతో నిల్వలు తగ్గాయి
ఆ నీటిని పాలమూరు ఎత్తిపోతలకు మళ్లించేలా బోర్డుకు ప్రతిపాదిద్దాం
అన్ని విషయాలు బోర్డుకు తానే వివరిస్తానన్న ముఖ్యమంత్రి
భేటీ వాయిదాకు అంగీకరించిన కృష్ణా బోర్డు

 
‘సాక్షి’ ప్రత్యేకం
 
 హైదరాబాద్  కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారం, వాస్తవ నీటి లెక్కలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. కృష్ణాలో వాస్తవ కేటాయింపులు, వినియోగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద నీటి మళ్లింపు తదితర అంశాలను బోర్డుకు ముఖ్యమంత్రే వివరించనున్నారు. ఈ బోర్డు సమావేశం శుక్రవారం (8వ తేదీన) ఢిల్లీలో జరగాల్సి ఉన్న దృష్ట్యా... తాను హాజరయ్యేందుకు వీలుగా మరో రోజుకు సమావేశాన్ని వాయిదా వేయించాలని సాగునీటి పారుదల అధికారులకు కేసీఆర్ సూచించారు. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డును కోరగా.. వారు అంగీకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కృష్ణాబోర్డు భేటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే స్వయంగా హాజరవుతారా? అన్న అంశం ఆసక్తి రేపుతోంది.

ఆ నీటిని పాలమూరుకు మళ్లిద్దాం..

కృష్ణా బేసిన్‌లో చేపట్టాలని భావిస్తున్న పాల మూరు, నక్కలగండి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. అనుమతులు లేకుండానే పాలమూరు ఎత్తిపోతలను చేపడుతున్నారంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసేందుకు ఏపీ సిద్ధమవుతోందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దానిపై స్పందించిన సీఎం.. పాలమూరు ఎత్తిపోతల పథకం వాస్తవానికి కొత్తది కాదని, గతంలో నీటి కేటాయింపులు కలిగిన భీమా ప్రాజెక్టేనని... హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 100 టీఎంసీల సామర్థ్యంతో ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి గతంలోనే అనుమతులు ఉన్నందున కొత్తగా అనుమతులు అవసరం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే వివాదం సృష్టించే ఉద్దేశంతో ఏపీ ఉందని అధికారులు సీఎంతో చెప్పినట్లు తెలిసింది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూడిక అంశాన్ని సీఎం ప్రస్తావించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ‘‘సాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 408 టీఎంసీలు అయితే అదిప్పుడు పూడిక కారణంగా 312 టీఎంసీలకు తగ్గింది. శ్రీశైలంలో కూడా 312 టీఎంసీల సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గింది. బిందలో మట్టిపోస్తే నీరంతా బయటకు పోయినట్లు, ప్రాజెక్టుల నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఒకవేళ పాలమూరుకు ఏపీ అభ్యంతరం చెబితే.. ఆ రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరుకు మళ్లిద్దామని బోర్డుకు ప్రాతిపాదిద్దాం. దీన్నెవరైనా కాదంటారా? అవసరమైతే బోర్డు ముందుకు నేనే వస్తా. బోర్డు సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయించండి. అన్ని విషయాలు నేను వారి దృష్టికి తీసుకెళాతా..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
బోర్డు అనుమతివ్వాలా..?

సీఎం సూచన మేరకు అధికారులు వెంటనే సమావేశాన్ని వాయిదా వేయాలని కృష్ణా బోర్డును కోరినట్లు తెలిసింది. బోర్డు కూడా దీనికి అంగీకరిస్తూ సమావేశాన్ని వాయిదా వేసింది. అయితే తదుపరి సమావేశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు, దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
 
జూలైలో తెలంగాణ హరిత హారం...

జూలైలో తెలంగాణ హరిత హారం కార్యక్రమం ప్రారంభిస్తామని, అందులో భాగంగా నగరంలో 3 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందని సీఎం చెప్పారు. దీనికోసం కూడా బస్తీల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.  జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కార్యక్రమం అమలుకు సంబంధించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అస్కి డెరైక్టర్ జనరల్ రవికాంత్ ఘనవ్యర్థాల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు